ఎన్నికల్లో పార్టీలు కాదు.. ప్రజలు గెలవాలి : నాందేడ్‌లో సీఎం కేసీఆర్
రైతులంటే ప్రభుత్వాలకు గౌరవం లేదా? నిత్యం పోరాడుతూనే ఉండాలా అని కేసీఆర్ ప్రశ్నించారు.
ఎప్పుడు ఎన్నికలు జరిగినా అక్కడ గెలవాల్సింది పార్టీలు కాదని.. ప్రజలు గెలవాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అన్నారు. దేశం మొత్తం మార్పు తీసుకొని రావాలనే లక్ష్యంతోనే భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భవించిందని కేసీఆర్ చెప్పారు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తల శిక్షణా శిబిరాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. రెండు రోజుల పాటు ఇక్కడ శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతాయని.. ఆ తర్వాత కమిటీలు ఏర్పాటు చేసుకొని గ్రామగ్రామానికి వెళ్లాలని కేసీఆర్ పార్టీ శ్రేణులను ఆదేశించారు.
దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటినా.. ఇంకా సమస్యలు పరిష్కారం కాలేదని చెప్పారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూసి చాలా మంది ఏవేవో మాట్లాడుతున్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఏం జరిగింది? దేశ సమస్యలు ఎక్కడివి అక్కడే ఉన్నాయని కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు కాదు.. ప్రజలు గెలవాలని అన్నారు.
దేశమంతా తెలంగాణ మోడల్ అమలు కావాలి. మన దేశంలో భారీగా నీటి వనరులు ఉన్నాయి. వాటిని మనం వాడుకోలేక వృథా చేస్తున్నాము. ప్రతీ ఏడాది వేలాది టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తోంది. మరోవైపు సాగుకు నీళ్లు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని అకోలా, ఔరంగాబాద్ వంటి పట్టణాల్లో వారానికి ఒకసారి మాత్రమే తాగునీరు ఇస్తున్నారు. దేశమంతా ఇలాంటి పరిస్థితే ఉందని కేసీఆర్ అన్నారు.
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో రైతులు ఉద్యమాలు చేశారు. ఎందరో రైతులు ఆందోళనలు చేసి తూటాలకు బలయ్యారు. రైతులంటే ప్రభుత్వాలకు గౌరవం లేదా? నిత్యం పోరాడుతూనే ఉండాలా అని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో రైతుల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బీమా, రైతు బంధు అందిస్తున్నట్లు చెప్పారు.
రైతులకు, ప్రభుత్వానికి మధ్య తెలంగాణలో దళారులు, బ్రోకర్లు ఉండరని కేసీఆర్ అన్నారు. తెలంగాణలోని రైతులందరి బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ప్రభుత్వం వద్ద ఉన్నాయని.. ఎప్పుడైనా పంట నష్ట పరిహారం వేయాలంటే.. హైదరాబాద్‌లో ప్రభుత్వం జమ చేస్తే.. నేరుగా రైతుల ఖాతాల్లోకే వెళ్తాయని కేసీఆర్ చెప్పారు. రైతు బీమాను కూడా అమలు చేస్తున్నాము. సదరు రైతే నామినీని ఎంచుకునే వెసులు బాటు ఉంటుంది. రైతు ఏ విధంగా మరణించినా.. 7 నుంచి 8 రోజుల్లోనే చెక్కు వారి కుటుంబానికి నేరుగా అందుతుందని చెప్పారు.
దేశమంతటా రైతులకు తెలంగాణ మాడల్ అమలు చేస్తామని కేసీఆర్ పునరుద్ఘాటించారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కాన్ అనే నినాదంతో మనం ముందుకు వెళ్లాలని.. ఇకపై దేశంలో వచ్చేది రైతు రాజ్యమే అని కార్యకర్తలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
కమిటీల ఏర్పాటు..
నాందేడ్‌లో ఏర్పాటు చేసిన కార్యకర్తల శిక్షణ తరగతుల్లో కమిటీల ఏర్పాటు ప్రాముఖ్యతను అధ్యక్షుడు కేసీఆర్ వివరించారు. గ్రామగ్రామాన బీఆర్ఎస్‌కు చెందిన కమిటీలను ఏర్పాటు చేయాలని.. అందుకు ప్రతీ బాధ్యుడికి ఒక ల్యాప్‌టాప్, ట్యాబ్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ పరంగా 9 కమిటీలను ఏర్పాటు చేయాలని కేసీఆర్ చెప్పారు. పార్టీ కమిటీ, రైతు, యువ, మహిళ, మైనార్టీ, ఓబీసీ, స్టూడెంట్‌తో పాటు ఇతర కమిటీలను ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రతీ కమిటీలో కనీసం ఆరుగురు సభ్యులు ఉండేలా చూడాలన్నారు. గ్రామంలో జనాభా పెరిగే కొద్దీ.. ఈ కమిటీల్లో సభ్యుల సంఖ్యను 11 నుంచి 24కు పెంచుకోవచ్చని చెప్పారు.
కమిటీల ఏర్పాటు పూర్తయిన తర్వాత గ్రామగ్రామానికి తిరిగి పార్టీ సభ్యత్వాన్ని చేయించాలని చెప్పారు. ప్రతీ నియోజకవర్గానికి పార్టీ ప్రచార సామాగ్రిని ఇప్పటికే అందజేసినట్లు కేసీఆర్ చెప్పారు. కార్యకర్తలు ఈ రెండు రోజులు శిక్షణ తరగతుల్లో అన్ని అనుమానాలు నివృత్తి చేసుకొని.. పార్టీని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఎవరైనా పార్టీ పని చేయలేమని భావిస్తే ఇప్పుడే వదిలేయండి.. ఒక సారి బాధ్యతను భుజానికి ఎత్తుకుంటే చివరి వరకు నడవాలని కేసీఆర్ చెప్పారు. మహారాష్ట్రలో పార్టీ బలోపేతానికి అవసరమైన మద్దతును అందిస్తానని కేసీఆర్ పార్టీ శ్రేణులకు అభియమిచ్చారు.