నొయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత నేడే
2009లో చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణంలో నిబంధనలు పాటించలేదంటూ స్థానికులు కోర్టును ఆశ్రయించారు. ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు, ట్విన్ టవర్స్‌ను కూల్చివేయాలని తీర్పు చెప్పింది.
నొయిడా ట్విన్ టవర్స్ కూల్చివేతకు రంగం సిద్ధమైంది. ఆదివారం మధ్యాహ్నం జంట టవర్లను నేలమట్టం చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. 40 అంతస్తుల భారీ భవంతులను కేవలం 10 నుంచి 13 సెకన్లలో నేలమట్టం చేయనున్నారు. 3,500 కేజీల పేలుడు పదార్థాలను అమర్చారు. వాటికి రెండు వేల వరకు కనెక్షన్లు ఇచ్చారు. కూల్చివేత వల్ల సమీపంలోని భవనాలకు నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ భవనాల్లో ఉంటున్న వాళ్లను తాత్కాలికంగా ఖాళీ చేయించారు. చుట్టుపక్కల బిల్డింగ్స్‌ను ప్లాస్టిక్ షీట్లతో కప్పేస్తున్నారు. ఆ ప్రాంతంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఫైర్ సిబ్బందితో పాటు అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. సమీపంలోని హైవేపై వాహనాల రాకపోకల్ని నిలిపివేయనున్నారు.
ఇంతకీ ఎందుకు కూల్చేస్తున్నారంటే..
అంత పెద్ద బిల్డింగ్‌ను ఎందుకు కూల్చేస్తున్నారనేగా సందేహం. నొయిడాలోని సెక్టార్ 93లో సూపర్ టెక్ లిమిటెడ్ కంపెనీ ట్విన్ టవర్స్‌ను నిర్మించింది. 2009లో చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణంలో నిబంధనలు పాటించలేదంటూ స్థానికులు కోర్టును ఆశ్రయించారు. ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు, ట్విన్ టవర్స్‌ను కూల్చివేయాలని తీర్పు చెప్పింది.
మన దేశంలో ఇదే అతి పెద్ద కూల్చివేత...
మన దేశంలో ఇప్పటి వరకూ జరిగిన కూల్చివేతల్లోకెల్లా ఇదే అతిపెద్ద కూల్చివేత కానుంది. కూల్చివేత నేపథ్యంలో పటిష్ట చర్యల్లో భాగంగా ఈ టవర్స్‌కు రెండు కిలోమీటర్ల పరిధిలో విమానాలు ఎగరకుండా కూడా చర్యలు తీసుకున్నారు. ఈ టవర్ల కూల్చివేత బాధ్యతలను నొయిడా అధికార యంత్రాంగం ఎడిఫైస్ ఇంజనీరింగ్, వైబ్రోటెక్ సంస్థలకు ఇచ్చింది. దీన్ని పర్యవేక్షించడానికి బ్రిటన్ నుంచి నిపుణులను రప్పించింది. ఇక కూల్చివేతతో 25 వేల క్యూబిక్ మీటర్ల శిథిలాలు మిగులుతాయని అంచనా వేస్తున్నారు. వాటి తొలగింపునకు కనీసం మూడు నెలలు పట్టనున్నట్టు తెలుస్తోంది.