సిగ్గు సిగ్గు.. మహిళా మంత్రి లేని అసెంబ్లీలో మహిళా సమస్యలపై చర్చా..?

మహిళలకు అసలు ప్రాధాన్యతే ఇవ్వని ప్రభుత్వం, ఇప్పుడు మహిళా సమస్యలపై అసెంబ్లీలో చర్చించడం నిజంగానే సిగ్గుచేటని అన్నారు ఎన్సీపీ నేత అజిత్ పవార్.

Advertisement
Update:2023-03-08 21:57 IST

ముఖ్యమంత్రి సహా 20మంది మంత్రులు కొలువుదీరిన ప్రభుత్వం అది. ఒక్క మహిళకు కూడా మంత్రి వర్గంలో చోటు లేదు. పోనీ అధికార పక్షంలో మహిళా ఎమ్మెల్యేలు లేరా అంటే అదీ కాదు. ఎమ్మెల్యేలు ఉన్నా కూడా అధికారం కోసం ఇరు వర్గాలు కుమ్ములాడుకోవడంతోనే సరిపోయింది. అందుకే బీజేపీ, శివసేన(షిండే వర్గం).. మొత్తంగా మహిళలకు గుండు సున్నా చుట్టింది. మంత్రి వర్గంలో స్థానం లేకుండా చేసింది. అలాంటి మహారాష్ట్ర మంత్రి వర్గం ఇప్పుడు మహిళలకు సంబంధించిన ఓ సమస్యపై చర్చను మొదలు పెట్టింది. దీంతో ప్రతిపక్ష ఎన్సీపీ నేత అజిత్ పవార్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వంలో సీఎం షిండే సహా 20మంది మంత్రులున్నారు. గరిష్టంగా అక్కడ 43మందిని మంత్రి వర్గంలోకి తీసుకోవచ్చు. అవకాశం ఉన్నా కూడా బీజేపీ, షిండే సేన గ్రూపుల కొట్లాటలో మహిళలకు మంత్రి పదవి ఇచ్చే విషయాన్ని వారు పట్టించుకోలేదు. మహిళలకు అసలు ప్రాధాన్యతే ఇవ్వని ప్రభుత్వం, ఇప్పుడు మహిళా సమస్యలపై అసెంబ్లీలో చర్చించడం నిజంగానే సిగ్గుచేటని అన్నారు ఎన్సీపీ నేత అజిత్ పవార్. మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన చర్చలో ఆయన ప్రభుత్వ తీరుని విమర్శించారు.

మహిళలకు సంబంధించి ఓ నూతన విధానంపై స్పీకర్‌ రాహుల్‌ నర్వేకర్‌ ప్రవేశపెట్టిన తీర్మానంపై మాట్లాడిన అజిత్‌ పవార్‌, కేబినెట్‌ లో మహిళలు లేకపోవడంపై విమర్శలు గుప్పించారు. మహిళలు నిర్భయంగా మాట్లాడకపోవడం వల్ల గృహహింసకు సంబంధించి చాలా వరకు ఫిర్యాదులు రావడం లేదన్నారు. తాజా విధానం ద్వారా అటువంటి వాటికి పరిష్కారం చూపాలని అజిత్‌ పవార్‌ సూచించారు.

Tags:    
Advertisement

Similar News