‘నీట్‌’ లీక్‌ వాస్తవమే.. రీ టెస్ట్‌కి నో.. సుప్రీంకోర్టు తీర్పు

మే 5న దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించగా, దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.

Advertisement
Update:2024-07-24 10:56 IST

‘నీట్‌’ ప్రశ్నపత్రం లీకైన మాట వాస్తవమేనని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే మళ్లీ పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. నీట్‌ అంశంపై విచారణ ముగియడంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ ఆధ్వర్యంలోని ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా చీఫ్‌ జస్టిస్‌ మాట్లాడుతూ.. జార్ఖండ్‌లోని హజారీబాగ్, బిహార్‌ లోని పట్నాలో గల కేంద్రాల్లో నీట్‌–యూజీ ప్రశ్నపత్రం లీకైందన్న మాట వాస్తవమేనని చెప్పారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేస్తోందని తెలిపారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దాదాపు 155 మంది లబ్ధిపొందినట్లు తెలుస్తోందని సీజేఐ చెప్పారు. ఆయా విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని చెప్పేందుకు సరైన ఆధారాలు లేవని, వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైందని నిర్ధారణకు రావడం ప్రస్తుత దశలో కష్టమని తెలిపారు. మళ్లీ పరీక్ష పెడితే 24 లక్షల మంది ఇబ్బంది పడతార‌ని చెప్పారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నీట్‌ మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది.

‘ఫిజిక్స్‌ వాలా’ విద్యాసంస్థ వ్యవస్థాపకుడు అలఖ్‌ పాండేతో పాటు మరికొందరు ఈ ఏడాది నిర్వహించిన నీట్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మే 5న దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించగా, దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి 67 మంది విద్యార్థులు 720కి పైగా సాధించడం, అందులోనూ హరియాణాలోని ఒకే పరీక్ష కేంద్రానికి చెందిన వారిలో అత్య‌ధిక మందికి తొలి ర్యాంక్‌ రావడం అనుమానాలకు తావిచ్చింది. ఈ క్రమంలోనే దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

రెండు రోజుల్లో నీట్‌ తుది ఫలితాల విడుదల..

నీట్‌ తుది ఫలితాలను రెండు రోజుల్లో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ విడుదల చేస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మంగళవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. సుప్రీంకోర్టు పరిశీలన ప్రకారమే నీట్‌ యూజీ మెరిట్‌ జాబితాను సవరిస్తామని ఆయన చెప్పారు. నీట్‌ అంశంపై ప్రతిపక్షాలు అరాచకం, అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ ఆయన ఆరోపించారు.

Tags:    
Advertisement

Similar News