బీజేపీకి ఇక మద్దతివ్వం.. ప్రతిపక్షంగానే ఉంటాం.. - బీజేడీ అధినేత నవీన్‌ పట్నాయక్‌

రాష్ట్రవ్యాప్తంగా మొబైల్‌ కనెక్టివిటీ బలహీనంగా ఉందని, బ్యాంకులకు చెందిన బ్రాంచీలు కూడా తక్కువగా ఉన్నాయని ఆయన తెలిపారు. బొగ్గు రాయల్టీని కూడా సవరించాలన్న ఒడిశా డిమాండును గత పదేళ్ల నుంచి కేంద్రం విస్మరించిందని చెప్పారు.

Advertisement
Update: 2024-06-25 03:07 GMT

బీజేపీకి ఇకపై తాము మద్దతివ్వబోమని, రాజ్యసభలో తాము ప్రతిపక్షంగానే ఉంటామని బిజూ జనతాదళ్‌ (బీజేడీ) అధ్యక్షుడు, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ స్పష్టం చేశారు. తమ పార్టీకి చెందిన తొమ్మిది మంది రాజ్యసభ ఎంపీలతో సోమవారం సమావేశం నిర్వహించిన ఆయన ఈ మేరకు వారికి దిశానిర్దేశం చేశారు. జూన్‌ 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ సమావేశాల సమయంలో.. శక్తిమంతమైన, చురుకైన ప్రతిపక్షంగా రాజ్యసభలో వ్యవహరించాలని తమ పార్టీ ఎంపీలకు చెప్పారు. రాష్ట్రానికి చెందిన సమస్యలపై కూడా సభలో కేంద్ర సర్కారును నిలదీయాలని తెలిపారు.

నవీన్‌ పట్నాయక్‌తో సమావేశం అనంతరం రాజ్యసభ ఎంపీ సస్మిత్‌ పాత్ర విలేకరులతో మాట్లాడుతూ ఈసారి బీజేడీ ఎంపీలు కేవలం సమస్యలపై మాత్రమే మాట్లాడరని స్పష్టం చేశారు. ఒడిశా ప్రయోజనాలను కేంద్రం విస్మరిస్తే.. బీజేపీ సర్కారుపై తీవ్ర పోరాటం చేస్తామని తేల్చిచెప్పారు. ఒడిశాకు ప్రత్యేక హెూదా ఇవ్వాలన్న డిమాండును కూడా లేవనెత్తనున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొబైల్‌ కనెక్టివిటీ బలహీనంగా ఉందని, బ్యాంకులకు చెందిన బ్రాంచీలు కూడా తక్కువగా ఉన్నాయని ఆయన తెలిపారు. బొగ్గు రాయల్టీని కూడా సవరించాలన్న ఒడిశా డిమాండును గత పదేళ్ల నుంచి కేంద్రం విస్మరించిందని చెప్పారు. దీని వల్ల రాష్ట్ర ప్రజలకు సరైన వాటా దక్కకుండా పోతోందని మండిపడ్డారు. రాజ్యసభలో రాష్ట్ర ప్రజల హక్కుల కోసం పోరాడాలని నవీన్‌ పట్నాయక్‌ తమకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని సస్మిత్‌ పాత్ర చెప్పారు. రాజ్యసభలో తమ పార్టీకి చెందిన తొమ్మిది మంది ఎంపీలు బలమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తారని వివరించారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజూ జనతాదళ్‌ పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఒడిశా రాష్ట్రాన్ని రెండున్నర దశాబ్దాల పాటు పాలించిన ఆ పార్టీ తాజా ఎన్నికల్లో 147 స్థానాలకు గాను 51 స్థానాలు మాత్రమే దక్కించుకొని పరాజయం పాలైంది. బీజేపీ అనూహ్యంగా 78 సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ పార్టీ 14 స్థానాలు తెచ్చుకోగా, సీపీఎం 1, మరో స్థానంలో ఇండిపెండెంట్‌ విజయం సాధించారు. మరోపక్క లోక్‌సభ స్థానాల్లో బీజేడీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. మొత్తం 21 స్థానాలకు గాను బీజేపీ ఏకంగా 20 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌ ఒక స్థానంలో గెలుపొందింది.

Tags:    
Advertisement

Similar News