నలుగురు సంతానం ఉంటే నవరత్నాలు కట్..

2001-2011 మధ్య కాలంలో మణిపూర్‌లో జనాభా పెరుగుదల 250 శాతంగా నమోదైంది. ఇప్పుడది దాదాపు 500 శాతానికి చేరుకుందని తాజా గణాంకాలు చెబుతున్నాయి.

Advertisement
Update:2022-10-15 13:40 IST

నవరత్నాలు అంటే ఏపీలో ప్రభుత్వ పథకాలు అనుకోవద్దు. ఇవి మణిపూర్ ప్రభుత్వ పథకాలు. అవును, మణిపూర్‌లో నలుగురు లేదా అంత కంటే ఎక్కువ సంతానం ఉన్నవారికి ప్రభుత్వ పథకాలు కట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తరపున రాయితీలు కానీ, ఆర్థిక ప్రయోజనాలు కానీ, ఇతరత్రా పథకాలకు కానీ నలుగురు సంతానం ఉన్న కుటుంబాలకు వర్తించకుండా కఠిన నిర్ణయం తీసుకున్నారు.

ఎందుకీ కఠిన నిర్ణయం.. ?

ఈశాన్య రాష్ట్రాల్లో జనసాంద్రత ఇటీవల కాలంలో భారీగా పెరుగుతోంది. జనాభా నివశించడానికి అనువైన స్థలం తక్కువ, జనాభా సంఖ్య ఎక్కువ అన్నట్టుగా ఉంది పరిస్థితి. దీంతో ప్రభుత్వాలకు కూడా ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం భారంగా మారింది. అందుకే జనాభా నియంత్రణపై స్థానిక ప్రభుత్వాలు దృష్టి సారించాయి. బహుభార్యత్వం కూడా అక్కడ మరో సమస్య. 2001-2011 మధ్య కాలంలో మణిపూర్‌లో జనాభా పెరుగుదల 250 శాతంగా నమోదైంది. ఇప్పుడది దాదాపు 500 శాతానికి చేరుకుందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. అందుకే ముందు జాగ్రత్తగా మణిపూర్ ప్రభుత్వం నలుగురు సంతానం ఉంటే ప్రభుత్వ పథకాలు కట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇటీవల అసోం కూడా ఇలాంటి చట్టం చేసింది. ఒకరు లేదా అంతకంటే ఎక్కువ భాగస్వాముల ద్వారా ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగి ఉంటే ప్రభుత్వ ఉద్యోగానికి వారిని అనర్హులుగా ప్రకటించింది. ఇప్పుడు మణిపూర్ ఇలాంటి నియంత్రణ చర్యలకు శ్రీకారం చుట్టింది. ముందుగా నలుగురు సంతానం ఉన్న కుటుంబాలను టార్గెట్ చేసింది. అప్పటికీ పరిస్థితిలో మార్పులేకపోతే ముగ్గురు సంతానం ఉన్న కుటుంబాలను కూడా ఈ పరిధిలోకి తీసుకొచ్చే ప్రణాళికలు రచిస్తున్నారు అధికారులు.

Tags:    
Advertisement

Similar News