మత కలహాలు రెచ్చగొట్టాలన్న బీజేపీ ప్రభుత్వ ప్రణాళికకు 'సుప్రీం' అడ్డుకట్ట

బెంగుళూరులోని వక్ఫ్ బోర్డుకు చెందిన ఈద్గా మైదానంలో గణేష్ చతుర్థి వేడుకలు నిర్వహించాలని కర్నాటక ప్రభుత్వం నిర్ణయించడం ఆందోళనకు కారణమయ్యింది. ఎన్నడూ లేని విధంగా బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనక రాజకీయ కారణాలున్నాయని, వచ్చే ఏడాది ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే ఈ చర్యలకు దిగుతోందని వక్ఫ్ బోర్డు ఆరోపించింది.

Advertisement
Update:2022-08-30 21:04 IST

కర్నాటక ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదమవడమే కాదు, మత కలహాలకు కారణమవుతాయనే ఆందోళనలు రేగాయి. చివరకు సుప్రీం కోర్టు జోక్యంతో ప్రస్తుతానికి సమస్య పరిష్కారమయ్యింది. 

బెంగుళూరులోని ఈద్గా మైదానంలో గణేష్ చతుర్థి వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ ఏనాడూ ఇతర మతాల కార్యక్రమాలు జరగలేదని, ఈ సారి కూడా జరగనివ్వొద్దని వక్ఫ్ బోర్డు ప్రభుత్వానికి విన్నవించినా ప్రభుత్వం ఆగలేదు. ఆ మైదానంలో వినాయకుడిని నిలబెడతామని, గణేష్ చతుర్థి వేడుకలు జరుపుతామని ప్రభుత్వం మొండికేసి‍ంది.

వక్ఫ్ బోర్డు హైకోర్టుకు వెళ్ళగా హైకోర్టు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దాంతో వక్ఫ్ బోర్డు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ రోజు ఆ కేసును విచారించిన సుప్రీం కోర్టు స్టేటస్ కో ఆదేశాలిచ్చింది. దాంతో అక్కడ గణేష్ చతుర్థి వేడుకలకు అనుమతి ఇవ్వడానికి వీలులేదు.

ఈ కేసు విచారణ సందర్భంగా కర్నాటక ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ, అక్కడ శాశ్వత నిర్మాణం నిర్మించబోవడంలేదు. రెండురోజుల పాటు వేడుకలకు అనుమతి ఇవ్వాలి'' అని వాదించారు. అయితే వక్ఫ్ బోర్డు తరపు న్యాయవాది దుష్యంత్ దవే,

"బాబ్రీ మసీదు విషయంలో అప్పటి యూపీ సీఎం కూడా ఇలాగే హామీ ఇచ్చారు. అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు" అని 1992లో మసీదు కూల్చివేతపై ప్రస్తావిస్తూ, దాని స్థానంలో ఇప్పుడు రామమందిరం ఉంది. అని అన్నారు. మతపరమైన మైనారిటీల హక్కులను తుంగలో తొక్కి ఆ తర్వాత వారిపై అనవ‌సర ముద్రలు వేయవద్దు' అని కోర్టులో వాదించారు.

"ఈ ఈద్గా మైదానంలో ఎన్నడూ మరే ఇతర వర్గాలకు చెందిన మతపరమైన కార్యక్రమాలు జరగలేదు... చట్టం ప్రకారం దీనిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించారు. 2022లో అకస్మాత్తుగా, ఇది వివాదాస్పద భూమి అని, ఇక్కడ గణేష్ చతుర్థి పండుగను నిర్వహిస్తామని చెప్పడం సరైంది కాదు "అని బోర్డు తరపు లాయర్ అన్నారు.

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి అందుకే ఈ వివాదం తీసుకొచ్చారు. ప్రభుత్వ చర్య వెనుక రాజకీయ ఉద్దేశాలన్నాయి అని వక్ఫ్ బోర్డు వాదించింది.

ఈద్గా మైదానంలో ఇంతకుముందు కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయా అని రాష్ట్ర న్యాయవాది ముకుల్ రోహత్గీని కోర్టు ప్రశ్నించగా, "ఇప్పుడు ఒక ఈవెంట్‌ను వ్యతిరేకించడానికి అది ప్రాతిపదిక కాదు" అని అన్నారు.

''ఢిల్లీలో దసరా దిష్టిబొమ్మలను ఎక్కడికక్కడ దహనం చేస్తారు.. గుజరాత్‌లో పండుగల కోసం వీధులు, దారులు మూసుకుపోతాయి. ఇక‌ హిందువుల పండుగ చేయొద్దు అంటారా?..గణేష్ చతుర్థి వేడుకలకు రెండు రోజులు అనుమతిస్తే ఇస్తే ఏం జరగబోతోంది? అని ప్రభుత్వ లాయర్ వాదించారు.

కానీ దుష్యంత్ దవే, "ఈ దేశంలో ఏదైనా దేవాలయంలో మైనారిటీ కమ్యూనిటీని ప్రార్థనల కోసం అనుమతిస్తారా ?'' అని ప్రశ్నించారు.

కాగా అంతకు ముందు రోజు, ఈ విషయం ఇద్దరు న్యాయమూర్తుల చిన్న బెంచ్ ముందు వచ్చింది, కానీ వారు ఒకరితో ఒకరు ఏకీభవించలేకపోయారు, కాబట్టి చీఫ్ జస్టిస్ UU లలిత్ ఈ కేసును జస్టిస్ ఇందిరా బెనర్జీ, AS ఓకా, MM సుందరేష్ లతో కూడిన‌ ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ కు ట్రాన్స్ ఫర్ చేశారు.

ఈ బెంచ్ ఈ రోజు స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసింది.

మరో వైపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈద్గా మైదానంలో గణేష్ చతుర్థి వేడుకలు నిర్వహిస్తామన్న పలు హిందూ సంఘాల ప్రకటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ రోజు ఈద్గా మైదానాన్ని కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. పోలీసు బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి. 

Tags:    
Advertisement

Similar News