జాతీయ పురుషుల కమిషన్ కి సుప్రీం 'నో'

గృహహింసకు గురైన పురుషులకు న్యాయం పొందేందుకు చట్టంలో అనేక నిబంధనలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంటూ ఆ పిటిషన్ ని సుప్రీంకోర్టు తిరస్కరించింది.

Advertisement
Update:2023-07-04 11:35 IST

మహిళల సమస్యల పరిష్కారానికి అండగా ఉన్న జాతీయ మహిళా కమిషన్ లాగే, పురుషులకు కూడా ఓ కమిషన్ కావాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. వివాహ సంబంధిత సమస్యలతో భర్తల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని, వారు గృహహింసకు గురవుతున్నారని.. అలాంటివారి కోసం ‘జాతీయ పురుషుల కమిషన్‌’ ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. మహేశ్‌ కుమార్‌ తివారీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ ని సుప్రీం తిరస్కరించింది.

ఇవీ గణాంకాలు..

జాతీయ పురుషుల కమిషన్ కావాలన్న పిటిషనర్ నేరగణాంక విభాగం నుంచి సేకరించిన సమాచారాన్ని సుప్రీం ముందు ఉంచారు. 2021లో దేశవ్యాప్తంగా 1,64,033 మంది ఆత్మహత్య చేసుకుంటే.. అందులో 81,063 మంది పెళ్లయిన పురుషులని, వివాహిత మహిళలు కేవలం 26,680 మాత్రమేనని పేర్కొన్నారు పిటిషనర్ మహేశ్. కుటుంబ సమస్యల కారణంగా 33.2 శాతం మంది పురుషులు ఆ ఏడాది ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. వివాహం చేసుకున్న పురుషుల ఆత్మహత్యలు నివారించేందుకు, గృహ హింసపై పురుషులు ఇచ్చే ఫిర్యాదులు ప్రత్యేకంగా నమోదు చేసుకునేలా జాతీయ మానవ హక్కుల కమిషన్‌ కు ఆదేశాలివ్వాలని పిటిషనర్‌ కోరారు. దీనికోసం జాతీయ పురుషుల కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు.

మేం అంగీకరించం..

పిటిషనర్ వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పెళ్లయిన తొలి మూడేళ్లలోనే ఎంత మంది యువతులు చనిపోతున్నారో మీకు తెలుసా..? అని ప్రశ్నించింది. వివక్షతతో కూడిన సానుభూతి ఎవరిపై తాము చూపడం లేదని తెలిపింది. భార్యల వేధింపుల కారణంగానే ఆ భర్తలంతా చనిపోతున్నారని తాము భావించడంలేదని, మీరు అలా అనుకుంటే అది పొరపాటేనని పేర్కొంది. గృహహింసకు గురైన పురుషులకు న్యాయం పొందేందుకు చట్టంలో అనేక నిబంధనలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంటూ ఆ పిటిషన్ ని తిరస్కరించింది.

Tags:    
Advertisement

Similar News