ముందస్తు ముచ్చట లేదు.. తేల్చేసిన మోదీ

ముందస్తుకు వెళ్తే లాభం ఏంటి, నష్టం ఏంటి అని ఈపాటికే బీజేపీ ఓ అంచనాకి వచ్చింది. ప్రస్తుతానికి ప్రతిపక్షాలు కూడా ముందస్తుకి ముచ్చట పడటం లేదు.

Advertisement
Update:2023-07-04 09:43 IST

మోదీ మంత్రివర్గ సమావేశం తర్వాత సంచలన నిర్ణయాలు బయటకొస్తాయని అనుకున్నారంతా. మంత్రి వర్గంలో మార్పులు, ముందస్తు ఎన్నికల సంకేతాలు వెలువడతాయనే అంచనాలేవీ నిజం కాలేదు. అయితే ముందస్తు ముచ్చట లేదు అనే విషయంలో మాత్రం క్లారిటీ వచ్చింది. మంత్రి వర్గ సహచరులకు మోదీ ఇచ్చిన ఉపదేశంతో ఈ విషయం తేలిపోయింది. 2024 జనవరి 26నాటికి బడ్జెట్ లో పొందుపరచిన అంశాలన్నీ అమలయ్యేలా చూడాలని మంత్రులకు సూచించారు మోదీ. అమలైన పథకాల గురించి, జరిగిన మంచి గురించి ప్రజలకు వివరించాలన్నారు. వచ్చే జనవరి నాటికి పథకాలు అమలు చేసి, ఆ తర్వాత ప్రచారం ముమ్మరం చేయాలనేది మోదీ ఆలోచన. అంటే 2024 వేసవిలోనే సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి, ముందస్తు ముచ్చట లేనే లేదు.

జి-20 కసరత్తులు..

ఈ ఏడాది ముందస్తు ఎన్నికలు జరగవు అని చెప్పడానికి మరో బలమైన కారణం కూడా ఉంది. సెప్టెంబర్లో జి-20 సమ్మిట్ ఢిల్లీలో జరుగుతుంది. ఆ సమావేశానికి కేంద్రం ఆతిథ్యం ఇస్తుంది. ఎన్నికల హడావిడి పెట్టుకుంటే ఈ ప్రపంచ సమ్మిట్ నిర్వహణ గందరగోళంగా మారుతుంది. అంటే ఈ ఏడాది చివర్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయనుకోలేం. ఇక వచ్చే ఏడాది మిగతా రాష్ట్రాల అసెంబ్లీలతోపాటే సార్వత్రిక ఎన్నికలు కూడా షెడ్యూల్ ప్రకారం జరగాల్సిందే.

మోదీని నమ్మగలమా..?

ముందస్తుకు వెళ్తే లాభం ఏంటి, నష్టం ఏంటి అని ఈపాటికే బీజేపీ ఓ అంచనాకి వచ్చింది. ప్రస్తుతానికి ప్రతిపక్షాలు ముందస్తుకి ముచ్చట పడటం లేదు. అన్ని పార్టీలు ఇగోలు పక్కనపెట్టి కలిసేందుకు కాస్త సమయం అవసరం. అందుకే వరుసగా మీటింగ్ లు పెట్టుకుంటున్నారు. ప్రతిపక్షాల కలయికను విచ్ఛిన్నం చేయాలంటే మోదీకి ఉన్న ఏకైక అస్త్రం ముందస్తు ఎన్నికలు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, కేంద్ర కేబినెట్ లో ఇచ్చిన సంకేతాల ప్రకారం ముందస్తు లేదు అనుకోవాల్సిందే. అయితే మోదీని అంత తేలిగ్గా నమ్మలేం. ఓ వ్యూహం ప్రకారమే ముందస్తుకి బీజేపీ సిద్ధంగా లేదు అనే సీన్ క్రియేట్ చేసి, సడన్ గా ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు పిలుపునిచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. 

Tags:    
Advertisement

Similar News