రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసు ఎన్ఐఏ చేతికి
మరోవైపు ఈ పేలుడుకు శివమొగ్గ, మంగుళూరులలో జరిగిన పేలుళ్లతో సంబంధం ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. బాంబులో వాడిన మెటీరియల్, టైమర్ అక్కడా ఇక్కడా ఒకటేనని అనుమానిస్తున్నారు.
ఐటీ రాజధాని బెంగళూరులోని ఫేమస్ రామేశ్వరం కెఫేలో బాంబు పేలుడు ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ కేసు దర్యాప్తును హోం శాఖ.. జాతీయ దర్యాప్తు సంస్థ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ- ఎన్ఐఏ)కు అప్పగించింది. కాగా నిందితుడు ఏ రూట్లో వచ్చాడు, పేలుడు తర్వాత తిరిగి ఎలా వెళ్లాడనే విషయంపై బెంగళూరు పోలీసుల దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చింది.
సిటీబస్సులో వచ్చిన నిందితుడు
ఈ పేలుడు కేసులో నిందితుడు ఎవరూ తనను గుర్తుపట్టకుండా క్యాప్, కళ్లద్దాలు పెట్టుకుని, కర్చీఫ్ కట్టుకున్నట్లు వీడియో ఫుటేజీల్లో గుర్తించారు. అతను 500డీ నంబర్ ఆర్టీసీ బస్సులో కెఫె దగ్గర దిగి లోపలికి వచ్చినట్లు కూడా గుర్తించారు.
శివమొగ్గ, మంగుళూరు బ్లాస్ట్‌లతో పోలికలు
రామేశ్వరం కెఫె బాంబు పేలుడు ఘటనలో నిందితుడికి 25-30 ఏళ్ల మధ్యలో ఉంటుందని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పారు. త్వరలోనే అతణ్ని పట్టుకుంటామని చెప్పారు. మరోవైపు ఈ పేలుడుకు శివమొగ్గ, మంగుళూరులలో జరిగిన పేలుళ్లతో సంబంధం ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. బాంబులో వాడిన మెటీరియల్, టైమర్ అక్కడా ఇక్కడా ఒకటేనని అనుమానిస్తున్నారు. దీంతో శివమొగ్గ, మంగుళూరుల్లో బాంబు పేలుళ్ల కేసులను డీల్ చేస్తున్న పోలీసులతో కలిపి దీన్ని దర్యాప్తు చేయాలని నిర్ణయించారు.