ఆయన తుఫాన్.. ఈయన సరైనోడు.. అది పొగడ్తల మీటింగ్
ఎంపీల మీటింగ్ లో NDA కూటమికి మోదీ ఈసారి కొత్త అర్థం చెప్పారు. ఇకనుంచి NDA అంటే ‘న్యూ ఇండియా, డెవలప్‌డ్ ఇండియా, ఆస్పిరేషనల్ ఇండియా’ అని అన్నారు.
ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ ఎంపీల సమావేశం పరస్పరం పొగడ్తలకే సరిపోయింది. ఎన్డీఏ మిత్రపక్షాల్లో ఏ ఒక్కర్నీ నిరాశపరచకుండా అందర్నీ ఆకాశానికెత్తేశారు మోదీ. ఆయన అవసరం అలాంటిది. ఈసారి కూటమిని దక్షిణాది రాష్ట్రాలు ఆదుకున్నాయనే అసలు విషయం కూడా ఆయన నోటివెంటే వచ్చింది. ఎన్డీఏ కూటమి సమావేశానికి 240 మంది బీజేపీ ఎంపీలతోపాటు టీడీపీ, జేడీయూ, శివసేన, ఎన్సీపీ, జనసేన, తదితర పార్టీల ఎంపీలు హాజరయ్యారు. మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సమావేశం తర్వాత మిత్రపక్షాలకు కృతజ్ఞతలు తెలిపిన మోదీ.. ప్రత్యేకంగా ఏపీ వ్యవహారాలను ప్రస్తావించారు. ఏపీలో చంద్రబాబు ఆధ్వర్యంలో చారిత్రక విజయాన్ని నమోదు చేశామన్నారు.
ఆయన తుఫాన్..
పవన్ కల్యాణ్ ఒక వ్యక్తి కాదు, తుఫాన్ అని అభివర్ణించారు మోదీ. ఏపీలో కూటమి విజయంలో పవన్ కీలక పాత్ర పోషించారన్నారు.
ఇక చంద్రబాబు, పవన్ కూడా మోదీ భజనలో తరించారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మోదీ దేశ ప్రజలందరికీ స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు పవన్ కల్యాణ్. మోదీ ప్రధానిగా ఉన్నంత వరకు ఏ దేశానికీ భారత్ తలొగ్గదన్నారు. ఆయన నేతృత్వంలో పనిచేయడాన్ని గర్వంగా భావిస్తున్నామన్నారు పవన్.
ఎన్డీఏను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రధాని మోదీ రేయింబవళ్లు కష్టపడ్డారని చెప్పారు చంద్రబాబు. సరైన సమయంలో సరైన నాయకత్వం భారత్‌కు అందివచ్చిందని అన్నారాయన. మేకిన్ ఇండియాతో భారత్‌ను ఆయన వృద్ధిపథంలో నడిపారన్నారు. మోదీ నాయకత్వంలో దేశం పేదరిక రహితంగా మారుతుందన్నారు. ఆయన నాయకత్వంలో 2047 నాటికి భారత్ నంబర్-1 గా నిలుస్తుందన్నారు చంద్రబాబు.
కూటమికి కొత్త అర్థం..
ఎంపీల మీటింగ్ లో NDA కూటమికి మోదీ ఈసారి కొత్త అర్థం చెప్పారు. ఇకనుంచి NDA అంటే ‘న్యూ ఇండియా, డెవలప్‌డ్ ఇండియా, ఆస్పిరేషనల్ ఇండియా’ అని అన్నారు. దేశం కోసం నిబద్ధత కలిగిన బృందం ఇదని చెప్పారు. NDA అంటేనే సుపరిపాలన, పేదల సంక్షేమం అని అన్నారు. వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేసి తీరుతామన్నారు. ఎన్నికల ముందు పొత్తు పెట్టుకున్న కూటమి ఇంతగా ఎప్పుడూ విజయవంతం కాలేదన్నారు మోదీ.