పాఠ్యపుస్తకాల్లో 'ఇండియా' ఇక కనపడదు..
ఇప్పుడు పుస్తకాల్లో కూడా ఇండియా పేరుని తొలగించారు. అంటే రాబోయే తరాలకు ఇక ఇండియా అనేది పరిచయం లేని పేరుగా మారిపోతుంది.
ఇండియా అనే పేరుని కనపడకుండా చేయాలనుకుంటున్న బీజేపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సదస్సుల్లో ఇండియా పేరుని భారత్ గా తెరపైకి తెచ్చిన కేంద్రం తాజాగా పాఠ్య పుస్తకాల్లో కూడా సమూల మార్పులకు సిద్ధమైంది. ఇకపై పాఠ్యపుస్తకాల్లో ఇండియా అనే పేరున్న చోట భారత్ అనే పేరు కనపడుతుంది. అంటే రాబోయే తరాలకు ఇండియా అనే పేరే తెలియదన్నమాట. భారత్ అనే పేరు మాత్రమే వారికి పరిచయంలోకి వస్తుంది.
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తతం NCERT కొత్తగా ముద్రించే పాఠ్య పుస్తకాల్లో ఇండియా బదులు భారత్ అనే పేరు కనపడుతుంది. కొత్తగా వచ్చే పుస్తకాలన్నింటిలో ఈ మార్పు ఉంటుంది. ఈ ప్రతిపాదనను కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించిందని ప్యానెల్ సభ్యుడు సీఏ ఇసాక్ తెలిపారు. ఈ పేరు మార్పు ప్రతిపాదన కొన్ని నెలల క్రితమే పెట్టామని, ఇప్పుడు ఆమోదించామని తెలిపారు.
భారత రాజ్యాంగంలో కూడా ఇండియా అనే పేరే ఉంటుంది. కానీ ఇటీవల ఎన్డీఏకి వ్యతిరేకంగా విపక్షాలు ఇండియా అనే పేరుతో కూటమి కట్టాక ఆ పేరుని వినడానికి అధికార పార్టీ అస్సలు ఇష్టపడటం లేదు. ఆ కూటమి పేరు బయటకొచ్చిన కొన్నిరోజులకే.. జి-20 దేశాల సదస్సు ఢిల్లీలో జరిగింది. ఈ సదస్సులో ఇండియా బదులు భారత్ అనే పేరునే కనపడేలా చేశారు. రాష్ట్రపతి పేరుతో పంపించిన ఆహ్వాన పత్రికలో కూడా 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' అని రాశారు. ప్రధాని మోదీ ముందు ఉంచిన నేమ్ ప్లేట్ లో కూడా ఇండియా బదులు భారత్ అని రాశారు. అంటే మొత్తంగా ఇండియాను కనుమరుగు చేయాలనేది కేంద్రం ఆలోచన. అందులో భాగంగానే భారత్ అనే పేరు హైలైట్ చేస్తున్నారు. ఇప్పుడు పుస్తకాల్లో కూడా ఇండియా పేరుని తొలగించారు. అంటే రాబోయే తరాలకు ఇక ఇండియా అనేది పరిచయం లేని పేరుగా మారిపోతుంది.