నవీన్ పట్నాయక్‌కు షాక్.. రాజకీయాలకు వారసుడు గుడ్‌బై!
అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు నవీన్ పట్నాయక్ వారసుడు పాండ్యన్ అని ప్రచారం జరిగింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ ఓటమి తర్వాత పాండ్యన్ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు.
ఒడిశాలో బిజు జనతా దళ్ ఓటమితో నవీన్ పట్నాయక్ కీలక అనుచరుడు వి.కె.పాండ్యన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పాండ్యన్ ఓ వీడియో రిలీజ్ చేశారు.
వీడియోలో పాండ్యన్ ఏం చెప్పారంటే?
నవీన్ పట్నాయక్‌కు సాయం చేయాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు పాండ్యన్. కాగా, తాజా పరిణామాల నేపథ్యంలో రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ ప్రయాణంలో ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించాలని కోరారు పాండ్యన్. ఎన్నికలకు ముందు తనకు వ్యతిరేకంగా జరిగిన ప్రచారం BJD ఓటమికి కారణమైతే తనను క్షమించాలన్నారు. BJD కార్యకర్తలందరిని క్షమాపణలు కోరారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు నవీన్ పట్నాయక్ వారసుడు పాండ్యన్ అని ప్రచారం జరిగింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ ఓటమి తర్వాత పాండ్యన్ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. ఇక నవీన్ పట్నాయక్ సైతం శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పాండ్యన్ తన వారసుడు కాదని, తన వారసుడెవరో ప్రజలే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. పార్టీ పరాజయానికి పాండ్యన్‌ను బాధ్యుడిని చేయడం సరికాదన్నారు. పాండ్యన్ చాలా అద్భుతంగా పని చేశారని ప్రశంసించారు.