ప్రమాణ స్వీకారోత్సవాన్ని బహిష్కరించిన ఎంవీఏ
ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయబోమని ప్రకటించిన ఆదిత్యఠాక్రే
మహారాష్ట్రలో మహాయుతి కూటమి నేతృత్వంలోని ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రంలోనే కీలక పరిణామం చోటుచేసుకున్నది. నేడు జరగాల్సిన ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రతిపక్ష కూటమి 'మహావికాస్ అఘాడీ' ఎమ్మెల్యేలు బహిష్కరించనున్నారు. ఈ విషయాన్ని శివసేన(యూబీటీ), మాజీ మంత్రి ఆదిత్యఠాక్రే వెల్లడించారు.
ఎంవీఏలో భాగమైన శివసేన (యూబీటీ) ఎమ్మెల్యేలు నేడు మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయడం లేదు. ఈవీఎంలపై మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. అందుకు నిరసనగా నేడు ప్రమాణ స్వీకారం చేయడం లేదు. ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఫలితాలపై ప్రజలు సంతృప్తిగా లేరు. ఈవీఎంల విషయంలోనూ తప్పు జరిగింది. ప్రజలు ఇచ్చిన తీర్పు అయితే వారంతా సంతోషంగా ఉండేవారు. అలా జరగలేదు కాబట్టే ఎక్కడా విజయోత్సవాలు కనిపించడం లేదని ఆదిత్య ఠాక్రే తీవ్ర ఆరోపణలు చేశారు.
ఆదిత్య చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ స్పందించారు. ఆయన చేసిన ఆరోపణలను ఖండించారు. ప్రతిపక్ష కూటమి నేత చేస్తున్న ఆరోపణలకు తావు లేదు. అవసరమైతే న్యాయస్థానాన్ని, ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని సూచించారు. మరోవైపు ఎమ్మెల్యేలుగా దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌తో సహా పలువురు ప్రమాణం చేశారు.