స్కూళ్లలో భజనలా.. ముస్లిం సంస్థల ఆగ్రహం..

కాశ్మీర్ ముస్లింలను అణగదొక్కేందుకే ఇక్కడి ప్రభుత్వ స్కూళ్లలో హిందూ మతపరమైన పాటల్ని ప్రవేశపెట్టారని, సూర్య నమస్కారాలు చేయాలంటూ ముస్లిం విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నారని మండిపడుతున్నారు స్థానిక నేతలు.

Advertisement
Update:2022-09-25 16:32 IST

కాశ్మీర్ లోని ప్రభుత్వ స్కూళ్లలో భజనలు, సూర్య నమస్కారాలు వెంటనే నిలిపివేయాలని ముత్తహిదా మజ్లిస్- ఎ- ఉలేమా(MMU) సంస్థ విద్యాశాఖను కోరింది. ముస్లింల మనోభావాలను దెబ్బతీయొద్దని కోరింది. మతగురువు, హురియత్ ఛైర్మన్ మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ నేతృత్వంలోని MMU సంస్థ ఈమేరకు అధికారులకు వినతిపత్రం అందించింది. ప్రార్థన, యోగా వంటి వాటిని తప్పనిసరి చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కోరింది. ముస్లిం విద్యార్థులు భజనలు, సూర్యనమస్కారాలు చేయాలని పాఠశాల సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారని, అది సరికాదని అన్నారు MMU సంస్థ ప్రతినిధులు.

కాశ్మీర్ ముస్లింలను అణగదొక్కేందుకే ఇక్కడి ప్రభుత్వ స్కూళ్లలో హిందూ మతపరమైన పాటల్ని ప్రవేశపెట్టారని, సూర్య నమస్కారాలు చేయాలంటూ ముస్లిం విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నారని మండిపడుతున్నారు స్థానిక నేతలు. దక్షిణ కాశ్మీర్ లోని కుల్గామ్ పాఠశాలలో రఘుపతి రాఘవ రాజా రామ్ భజన పాట పాడించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ముస్లింలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అన్ని స్కూళ్లలో ఇలాంటి పాటల్ని, సూర్య నమస్కారాలను కంపల్సరీ చేశారు. దీన్ని ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు.

పీడీపీ విమర్శలు..

కాశ్మీర్ లో హిందుత్వ ఎజెండాను బీజేపీ ముందుకు తెస్తోందని మండిపడ్డారు పీడీపీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ. కాశ్మీర్ లో ముస్లింల గుర్తింపుని బలహీనపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారామె. ముస్లింల మత విశ్వాసాలకు సవాలుగా నిలుస్తున్న ఇలాంటి చర్యలను సహించబోమని చెప్పారు. ఇస్లాంకు వ్యతిరేకంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే.. ఇకపై ముస్లింలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించవద్దని సూచించారామె. ముస్లిం టీచర్లు కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదని తెలిపారు.

అయితే కాశ్మీర్ లో మత ఛాందసవాదం పెరగడాన్ని సహించబోమని అంటున్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అల్తాఫ్ ఠాకూర్. ఇవి కొత్త నిర్ణయాలు కావని, సనాతన సంప్రదాయాలని చెప్పారు. భజనలపై ప్రశ్నలు లేవనెత్తే ముందు వాటిని సరిగా వింటే.. ఎవరూ అడ్డు చెప్పరని అంటున్నారాయన. పాటలు, సూర్య నమస్కారాలతో ఎలాంటి మతపరమైన ఇబ్బందులు తలెత్తవని, ఎవరి మనోభావాలు గాయపడవని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News