ముంబై-జైపూర్ ఎక్స్ ప్రెస్ లో తెల్లవారు ఝామున జరిగిన కాల్పుల్లో నలుగురు దుర్మరణంపాలయ్యారు. ఈ రైలు గుజరాత్ నుంచి ముంబైకి వస్తోంది. మృతుల్లో ఆర్పీఎఫ్ ఏఎస్ఐ సహా ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు. బుల్లెట్ గాయాలతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో ఒక్కసారిగా కలకలం రేగింది.
ఎందుకీ కాల్పులు..?
ఆర్పీఎఫ్ కు చెందిన కానిస్టేబుల్ చేతన్ ని నిందితుడుగా గుర్తించారు. అతనితోపాటు అదే రైలులో ఆర్పీఎఫ్ ఏఎస్ఐ కూడా B5 బోగీలో ప్రయాణిస్తున్నాడు. వారిద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. తెల్లవారు ఝామున 5.23గంటలకు ఒక్కసారిగా చేతన్ తుపాకీ బయటకు తీశాడు. విచక్షణా రహితంగా కాల్చాడు. ఈ కాల్పుల్లో ఏఎస్సై సహా ముగ్గురు సాధారణ ప్రయాణికులు కూడా చనిపోయారు. అయితే కాల్పులకు కారణం ఏంటనేది తెలియడంలేదు. దీనిపై ఆర్పీఎఫ్ అధికారులు విచారణ ప్రారంభించారు.
వాపి-బొరివలిమిరా రోడ్ స్టేషన్ మధ్య ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. కాల్పుల ఘటన తర్వాత దహిసర్ స్టేషన్ సమీపంలో చేతన్ రైలు నుంచి దూకి పారిపోయాడు. పోలీసులు నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణికులను కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన ఎలా జరిగిందనే కోణంలో విచారణ జరుపుతున్నారు. అదృష్టవశాత్తు ఈ కాల్పుల్లో ఎక్కువ మంది ప్రయాణికులు గాయపడలేదు.