అత్యంత కలుషిత నగరంగా ముంబై.. ఢిల్లీని కూడా దాటేసింది
వాహనాల నుంచి వెలువడే కాలుష్యం, రోడ్లపై ఉండే దుమ్మూ ధూళి వల్ల ముంబైలో ఇటీవల కలుషితం బాగా పెరిగిపోయింది. నిర్మాణాలు కూడా అధికమయ్యాయి.
మొన్నటివరకు మనదేశంలో అత్యంత కలుషిత నగరం ఏది అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు ఢిల్లీ. ఆ నగరంలో కాలుష్యం అధికమవ్వడంతో దానిని తగ్గించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం చేయని ప్రయత్నం అంటూ లేదు. చివరికి దీపావళి పండుగను కూడా ఆ రాష్ట్ర ప్రజలు జరుపుకోలేదు. ఇళ్ల నిర్మాణాలను నిలిపివేశారు. రోడ్లపై తిరిగే వాహనాల సంఖ్యను కూడా తగ్గించారు. అయితే ఇప్పుడు కాలుష్యంలో ఢిల్లీని ముంబై నగరం దాటేసింది. మనదేశంలో అత్యంత కలుషిత నగరంగా నిలవడమే కాకుండా ప్రపంచంలో అత్యంత కలుషిత నగరాల్లో రెండో స్థానంలో నిలిచింది.
జనవరి 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 8వ తేదీల మధ్య నమోదైన కాలుష్యం ఆధారంగా ప్రపంచంలోని అత్యంత కలుషిత నగరాల జాబితాను స్విస్ ఎయిర్ ట్రాకింగ్ ఇండెక్స్ ఐక్యూ ఎయిర్ తయారుచేసింది. అయితే ఈ జాబితాలో ఢిల్లీని వెనక్కి నెట్టి ప్రపంచంలోనే రెండవ స్థానంలో ముంబై నిలిచింది. గత నెల 29న ఈ సంస్థ తయారు చేసిన ర్యాంకింగ్స్ లో పదో స్థానంలో నిలిచిన ముంబై ఆ తర్వాత నాలుగు రోజుల గ్యాప్ లోనే ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరంగా తొలి స్థానానికి చేరుకుంది. ఫిబ్రవరి 8వ తేదీకి మళ్లీ రెండో స్థానంలో నిలిచింది.
వాహనాల నుంచి వెలువడే కాలుష్యం, రోడ్లపై ఉండే దుమ్మూ ధూళి వల్ల ముంబైలో ఇటీవల కలుషితం బాగా పెరిగిపోయింది. నిర్మాణాలు కూడా అధికమయ్యాయి. చలికాలం కూడా కావడంతో ముంబైలో కాలుష్యం తీవ్రమైనట్లు నిపుణులు తెలుపుతున్నారు. ముంబైలో కాలుష్యం తీవ్రమైన నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు చేపట్టింది. నిర్మాణాలను తాత్కాలికంగా నిలిపివేసింది. దుమ్ము, ధూళి నియంత్రణకు అధికారులకు మార్గదర్శకాలు ఇచ్చింది.