ఎట్టకేలకు ఆ మంత్రి చెప్పులేసుకున్నాడు..!
సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన తోమర్ రెండు నెలలు చెప్పుల్లేకుండా తిరిగారు. కాగా ఇటీవల గ్వాలియర్లో రోడ్ల మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి.
మధ్యప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి ప్రద్యుమన్ సింగ్ తోమర్ రూటే సపరేటు. రాజకీయాల్లో అందరికంటే భిన్నంగా నడుచుకుంటూ ఉంటాడు ఈయన. గ్వాలియర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి అయిన ఈయన ప్రజల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటారు. ఎవరైనా ఏదైనా ఫిర్యాదు చేస్తే.. దానిని పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వకుండా స్వయంగా తానే రంగంలోకి దిగి సమస్యలను పరిష్కరిస్తుంటారు. గతంలో ఒకసారి ఆయన ఓ పాఠశాలకు వెళ్ళగా.. మరుగుదొడ్లు శుభ్రంగా ఉండటం లేదని ఓ విద్యార్థిని ఫిర్యాదు చేసింది. అంతే చీపురు పట్టుకొని స్వయంగా ఆయన మరుగుదొడ్లను శుభ్రం చేశారు.
ఓసారి గ్వాలియర్ లోని కమిషనర్ కార్యాలయానికి వెళ్ళగా అక్కడ కూడా మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోవడంతో స్వయంగా క్లీన్ చేశారు. గత అక్టోబర్ 30వ తేదీన తోమర్ గ్వాలియర్ నియోజకవర్గంలో పర్యటిస్తుండగా.. ఎక్కడ చూసినా రోడ్లు గుంతలమయమై కనిపించాయి. ప్రజలు కూడా రోడ్లు బాగా చేయాలని మంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన గ్వాలియర్ లో రోడ్లకు మరమ్మతులు పూర్తయ్యేంతవరకు పాదరక్షలు ధరించనని ప్రమాణం చేశారు.
సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన తోమర్ రెండు నెలలు చెప్పుల్లేకుండా తిరిగారు. కాగా ఇటీవల గ్వాలియర్లో రోడ్ల మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. తాజాగా గ్వాలియర్ నియోజకవర్గంలో పర్యటించిన కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వయంగా ప్రద్యుమన్ సింగ్ కు కొత్త చెప్పులు అందించారు. దీంతో ఆయన 56 రోజుల తర్వాత మళ్లీ చెప్పులు ధరించారు.