భారత్‌లో మత స్వేచ్ఛపై `అమెరికా` ఆందోళన - తీవ్రంగా ఖండించిన భారత్
భారత్‌లో మత స్వేచ్ఛపై అమెరికా ఇచ్చిన నివేదికపై కేంద్రం తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది.
భారత్‌లో మత స్వేచ్ఛపై అమెరికా ఇచ్చిన నివేదికపై కేంద్రం తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది. ఆ నివేదికను తీవ్రంగా ఖండించింది. ప్రపంచవ్యాప్తంగా మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఈ వార్షిక నివేదికను వెలువరించింది. ఇందులో మత స్వేచ్ఛపై ఆందోళన వ్యక్తం చేసిన అమెరికా.. రష్యా, భారత్, సౌదీ అరేబియా, చైనా వంటి పలు దేశాలను ఆ నివేదికలో ప్రస్తావించింది. మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయంటూ భారత్‌లోని మత స్వేచ్ఛను విమర్శిస్తూ ఆ నివేదికలో పేర్కొంది.
అమెరికా ఇచ్చిన నివేదికపై భారత్ తీవ్రంగా ఖండించింది. ఆ నివేదికను తోసిపుచ్చింది. ఇది పూర్తిగా పక్షపాత, ప్రేరేపిత నివేదిక అని తెలిపింది. తప్పుదోవ పట్టించే సమాచారం, అవగాహనలేమి వల్ల అటువంటి నివేదికలు వస్తూనే ఉంటాయని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి దీనిపై వ్యాఖ్యానించారు.
అమెరికాతో ఉన్న తమ భాగస్వామ్యానికి తాము విలువనిస్తామని.. అయితే భారత్‌ను ఇబ్బంది పెట్టే అంశాలపై స్పష్టమైన వైఖరిని వెల్లడిస్తామని బాగ్చి తాజాగా విలేకరుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. కొందరు యూఎస్ అధికారుల నోటి నుంచి వచ్చే ప్రేరేపిత, పక్షపాత వ్యాఖ్యానాలు.. నివేదికలపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని ఆయన తెలిపారు. అమెరికా నుంచి ఇలాంటి కథనాలు గతంలోనూ వచ్చాయి. అప్పట్లోనూ భారత్ వాటిని ఖండిస్తూ తీవ్రంగానే స్పందించింది.