ఆ దేశాల్లో దుర్భర జీవితం.. భారత్ ర్యాంక్ ఎంతంటే..?

ప్రఖ్యాత ఆర్థికవేత్త స్టీవ్ హాంకే ప్రతి ఏడాదీ ఈ మిజరీ ఇండెక్స్ రూపొందించి వివరాలు విడుదల చేస్తుంటారు. మొత్తం ప్రపంచంలోని 157 దేశాలకు ఈ సారి ర్యాంకింగ్స్ ఇచ్చారు.

Advertisement
Update:2023-05-24 17:32 IST

ఇటీవల ప్రపంచంలో హ్యాపీయెస్ట్ కంట్రీగా ఫిన్లాండ్ అగ్రస్థానంలో నిలిచింది. మరి ప్రపంచంలోనే అత్యంత దారుణమైన స్థితిలో ఉన్న దేశం ఏంటి..? ఇలాంటి సర్వే కూడా ఒకటి రెడీ అయింది. వరల్డ్ మోస్ట్ మిజరబుల్ కంట్రీ పేరుతో జరిగిన అన్వేషణ జింబాబ్వే దగ్గర ఆగింది. అవును, జింబాబ్వే ఈ ప్రపంచంలోనే అత్యంత దుర్భర దేశంగా పేరు తెచ్చుకుంది. ఆ దేశ ద్రవ్యోల్బణం 243.8శాతం. ఏం కొనాలన్నా, ఏం తినాలన్నా.. అక్కడి పేద, మధ్యతరగతి వర్గాలకు అసాధ్యం. ద్రవ్యోల్బణం కారణంగా అంతకంతకూ పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో జింబాబ్వే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిరుద్యోగం, అప్పులు, ప్రజల అనారోగ్యం, రక్తహీనత.. ఇలా జింబాబ్వే కష్టాలు చెప్పడానికి పేజీలు సరిపోవు.

జింబాబ్వే తర్వాత అత్యంత దారుణమైన జీవన పరిస్థితులు ఉన్న దేశం వెనిజులా. సిరియా, లెబనాన్, సూడాన్, అర్జెంటీనా, యెమెన్, ఉక్రెయిన్, క్యూబా, టర్కీ, శ్రీలంక, హైతీ, అంగోలా, టోంగా, ఘనా దేశాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆయా దేశాల్లో ఎక్కడా సామాన్య ప్రజలు కడుపునిండా తినే పరిస్థితి లేదు. అర్థాకలితో అలమటించాల్సిందే, ఆదాయం కోసం అడ్డదార్లు తొక్కాల్సిందే.


భారత్ పరిస్థితి ఏంటి..?

ప్రఖ్యాత ఆర్థికవేత్త స్టీవ్ హాంకే ప్రతి ఏడాదీ ఈ మిజరీ ఇండెక్స్ రూపొందించి వివరాలు విడుదల చేస్తుంటారు. మొత్తం ప్రపంచంలోని 157 దేశాలకు ఈ సారి ర్యాంకింగ్స్ ఇచ్చారు. ఇక భారత్ విషయానికొస్తే.. 157 దేశాల్లో ఇండియా స్థానం 103. అంటే భారత్ కంటే మెరుగైన జీవన ప్రమాణాలు ఉన్న దేశాలు ప్రపంచంలో 54 ఉన్నాయనమాట. భారత్ లో నిరుద్యోగం తీవ్ర స్థాయిలో ఉండటంతో ర్యాంకు 103 దగ్గరే ఆగిపోయింది. ఇక ప్రపంచంలోనే జీవనానికి అత్యంత అనుకూల దేశం స్విట్జర్లాండ్. మోస్ట్ మిజరబుల్ కంట్రీ లిస్ట్ లో స్విట్జర్లాండ్ లాస్ట్ ప్లేస్ లో ఉంది. అంటే స్విట్జర్లాండ్ జన జీవనానికి అత్యంత అనుకూలదేశం అనమాట. అక్కడ నిరుద్యోగం లేదు, ఎవరి జీవనాధారం వారికి ఉంది. అన్ని వస్తువులు అందుబాటు ధరల్లోనే ఉంటాయి. దాదాపు పేద వర్గం అంటూ ఏదీ అక్కడ లేదు. స్విట్జర్లాండ్ కంటే ముందు స్థానం ఐర్లాండ్ ది. జపాన్, మలేసియా, తైవాన్, నైజర్, థాయిలాండ్, టోగో, మాల్టా దేశాలు కూడా ప్రజల జీవన ప్రమాణాలు, వారి సంతోషకరమైన జీవితం విషయంలో ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. అమెరికా కూడా వీటి తర్వాతే అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

Tags:    
Advertisement

Similar News