మా అమ్మ నా చాక్లెట్లు దొంగతనం చేస్తోంది, ఆమెను జైల్లో వేయండి... పోలీసులకు చిన్నారి పిర్యాదు
తన తల్లి తన చాక్లెట్లు దొంగతనం చేస్తోందని ఓ మూడేళ్ళ బుడతడు పోలీసులకు పిర్యాదు చేశాడు. తల్లిని జైల్లో వేయాలని డిమాండ్ చేశాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మధ్యప్రదెశ్ లోని బుర్హాన్‌పూర్ జిల్లాలోని దేఢ్‌తలై పోలీసు స్టేషన్ లో పోలీసులందరూ ఎవరిపనుల్లో వారు నిమగ్నమై ఉండగా ఓ మూడేళ్ళ బాలుడు స్టేషన్ కు వచ్చాడు. పోలీసులందరూ ఆ బాబు వైపు ఆశ్చర్యంగా చూస్తుండగా ఆ బుడతడు ముద్దు ముద్దు మాటలతో తన అమ్మ మీద పిర్యాదు చేయడానికి వచ్చానని చెప్పాడు. పోలీసులకు ఆసక్తి పెరిగింది. ఓ లేడీ కానిస్టేబుల్ పేపర్ పెన్ను తీసుకొని ఆ బాలుడు ఇచ్చిన పిర్యాదు రాసుకోవడానికి సిద్దమై పిర్యాదు ఏంటో చెప్పమంది.
''మా అమ్మ నా చాక్లెట్లు దొంగిలిస్తోంది. అడిగితే కొడుతోంది. ఆమెను జైల్లో వేయండి'' అంటూ పిర్యాదు చేశాడు బాలుడు. ఆ కానిస్టేబుల్ కూడా ఆ బాలుడు చెప్పిన ప్రతి విషయాన్ని జాగ్రత్తగా రాశారు. ఆ చిన్నారి చెప్పిన మాటలు విని పోలీస్ స్టేషన్‌లో ఉన్న సిబ్బంది పగలబడి నవ్వారు.
ఆ చిన్నారితోపాటు అతని తండ్రి కూడా వచ్చాడు. పోలీసు స్టేషన్ కు తీసుకెళ్ళాలని మారాం చేయడంతో తీసుకరాకతప్పలేదని చెప్పాడు. "అతని తల్లి అతనికి స్నానం చేయించిన తర్వాత అతని కళ్లకు కాటుక పూస్తోంది, కానీ అతను చాక్లెట్ తినాలని పట్టుబట్టి ఆమెను డిస్టర్బ్ చేసాడు. అతని తల్లి అతనిని తేలికగా కొట్టింది, అప్పుడు అతను ఏడుపు ప్రారంభించాడు. నన్ను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లమని గొడవ ప్రారంభించాడు. అందుకే అతన్ని ఇక్కడికి తీసుకొచ్చాను." అని ఆ బాలుడి తండ్రి చెప్పాడు.
ఆ చిన్నారి ఫిర్యాదు విని అందరూ నవ్వుకున్నారని సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రియాంక నాయక్ తెలిపారు. ''అతని తల్లికి చెడు ఉద్దేశ్యం లేదని, నిన్ను ప్రేమిస్తోందని అందుకే ఎక్కువగా చాక్లెట్లు తినొద్దని చెప్తోందని నేను అతనికి వివరించాను.మెల్లెగా నచ్చజెప్పి ఆ బాలుడిని ఇంటికి పంపించాను'' అని సబ్ ఇన్‌స్పెక్టర్ అన్నారు.
ఆ బాలుడు అమాయకంగా తల్లిపై పిర్యాదు చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ బుడతడి అమాయకత్వానికి నెటిజనులు నవ్వుకుంటున్నారు.