మోడీ ఓ విష సర్పం.. ఖర్గే వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం

ప్రధానిని విష సర్పంతో పోల్చిన ఖర్గే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ డిమాండ్ చేశారు. ఇది మోడీపై దాడి కాదని దేశం పై దాడి అని.. మరో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు.

Advertisement
Update:2023-04-28 10:53 IST

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోడీని విష సర్పంతో పోల్చడంపై బీజేపీ అగ్ర నేతలు ఖర్గేపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మే 10వ తేదీన కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రధాన పార్టీల అగ్రనేతలు కర్ణాటకలోనే మకాం వేశారు. పోటాపోటీగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

గురువారం కలబురగి జిల్లాలో ఏర్పాటుచేసిన ఓ బహిరంగ సభలో ఖర్గే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ విష సర్పం లాంటి వారిని ఆరోపించారు. ఆ పాముకు విషం ఉందో లేదో ప్ర‌జ‌ల‌కు బాగా తెలుస‌ని, ఒకవేళ దానిని తాకితే చనిపోతారని వ్యాఖ్యానించారు.

అయితే ప్రధాని మోడీపై ఖర్గే చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాన్ని సృష్టించాయి. ఖర్గే వ్యాఖ్యలపై కర్ణాటక ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషం ఖర్గే మెదడులోనే ఉందని, బీజేపీ, మోడీపై కాంగ్రెస్ కు ఉన్న పక్షపాత ధోరణికి ఖర్గే వ్యాఖ్యలే నిదర్శనమని బసవరాజ్ బొమ్మై వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ మునిగిపోయే పడవ లాంటిదని, మోడీని రాజకీయంగా ఎదుర్కోలేకే ఆ పార్టీ నేతలు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రధానిని విష సర్పంతో పోల్చిన ఖర్గే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ డిమాండ్ చేశారు. ఇది మోడీపై దాడి కాదని దేశం పై దాడి అని.. మరో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు. ఖర్గే వ్యాఖ్యలు గాంధీ కుటుంబ అభిప్రాయాలను ప్రతిబింబిస్తున్నాయని ఆమె ఆరోపించారు.

కాగా, ప్రధాని మోడీని విష సర్పంగా పోల్చడంపై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఖర్గే వివరణ ఇచ్చారు. ప్రధాని మోడీని తాను విష సర్పం అని అనలేదని చెప్పారు. తాను కేవలం బీజేపీ భావజాలాన్ని ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేసినట్లు వివరించారు. 'బీజేపీ భావజాలం పాము లాంటిదని.. దాన్ని ముట్టుకునే ప్రయత్నం చేస్తే చనిపోయే ప్రమాదం ఉందని..' అన్నట్లు పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News