డైవర్షన్ గేమ్ లో మోదీ దిట్ట.. రాహుల్ 'శక్తి' వ్యాఖ్యలకు ప్రధాని వక్రభాష్యం
'శక్తి' అంటే మహిళ అనే అర్థం వచ్చేలా రాహుల్ వ్యాఖ్యానించలేదు, కానీ మోదీ మాత్రం డైవర్షన్ గేమ్ మొదలు పెట్టారు. దేశంలోని మహిళల్ని రాహుల్ కించపరిచారంటూ విమర్శలు మొదలు పెట్టారు.
'శక్తి'పై తాము పోరాటం చేస్తామంటూ ముంబైలో భారత్ జోడో న్యాయ యాత్ర ముగింపు సమావేశంలో ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోదీపై తమ పోరాటం వ్యక్తిగతంగా కాదని, శక్తికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని అన్నారు. ఇక్కడ శక్తి అంటే అధికారం అని రాహుల్ ఉద్దేశం. రాజు(మోదీ) ఆత్మ.. ఈవీఎంలు, ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థల్లో ఉందని, అవి లేకుండా ఆయన గెలవలేరని అన్నారు రాహుల్. అయితే 'శక్తి' అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలకు ప్రధాని మోదీ వక్రభాష్యం చెప్పారు. 'శక్తి' అంటే దేశంలోని ప్రతి తల్లి, చెల్లి, కుమార్తె అని అంటున్నారు మోదీ. అలాంటి 'శక్తి'ని నాశనం చేస్తామని కొంతమంది సవాళ్లు విసురుతున్నారని, వారి నిజస్వరూపం ఏంటో తెలిసిందన్నారు. జగిత్యాల సభలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
'శక్తి' అంటే మహిళ అనే అర్థం వచ్చేలా రాహుల్ వ్యాఖ్యానించలేదు, కానీ మోదీ మాత్రం డైవర్షన్ గేమ్ మొదలు పెట్టారు. దేశంలోని మహిళల్ని రాహుల్ కించపరిచారంటూ విమర్శలు మొదలు పెట్టారు. దేశంలోని ప్రతి మహిళ, కుమార్తె 'శక్తి'కి ప్రతిరూపం అని, అందుకే మనమంతా వారిని వారిని ఆరాధిస్తామని, 'శక్తి'ని నాశనం చేస్తామని విపక్ష కూటమి మేనిఫెస్టోలో ప్రకటించిందని, వారి సవాల్ ని తాను స్వీకరిస్తున్నానని చెప్పారు మోదీ. మన తల్లులు, కుమార్తెలను కాపాడుకునేందుకు ప్రాణ త్యాగానికైనా సిద్ధమేనంటూ మరింత భారీ డైలాగులు కొట్టారు. అక్కడితో ఆగలేదు వచ్చే ఎన్నికల్లో 'శక్తి'ని ఆరాధించే వారికి, దాన్ని నాశనం చేస్తామని చెప్పేవారికి మధ్య పోరాటం జరుగుతోందని చెప్పారు మోదీ.
గతంలో కూడా ఇలాగే లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా, తామంతా మోదీ కుటుంబం అంటూ బీజేపీ నేతలు రెచ్చిపోయారు. ఇప్పుడు 'శక్తి'వ్యాఖ్యలకు కూడా ఇలాగే వక్రభాష్యం చెప్పడం మొదలు పెట్టారు. ఈవీఎంలు, ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థలపై వచ్చిన విమర్శలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకునే క్రమంలో మహిళలను కించపరిచారంటూ రెచ్చిపోయారు మోదీ.
మోదీ వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ వెంటనే కౌంటర్ ఇచ్చారు. తన మాటలకు మోదీ వక్రభాష్యం చెప్పారని అన్నారు. తన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పే ధైర్యం లేక పెడర్థాలు తీస్తున్నారని అన్నారు. ఈవీఎంలు, ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలపై పనిచేస్తున్న 'శక్తి' గురించే తాను మాట్లాడానని చెప్పారు రాహుల్.