మోదీ పక్కన పవార్.. తిట్టిపోస్తున్న ఉద్ధవ్ సేన
ఈ కలయికను రాజకీయాలతో ముడిపెట్టొద్దంటూ కొద్దిరోజుల క్రితమే శరద్ పవార్ వర్గం ప్రకటించింది. అయితే స్టేజ్ పై మోదీ ఆత్మీయ కరచాలనం, పలకరింపు.. అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాయి.
ప్రధాని మోదీతో శరద్ పవార్ వేదికను పంచుకోవడం సంచలనంగా మారింది. పుణెలో లోకమాన్య తిలక్ స్మారక కార్యక్రమానికి ఎన్డీఏ నేతలతోపాటు శరద్ పవార్ కూడా హాజరయ్యారు. ఒకేవేదికపై కలసి ఉండటమే కాదు మోదీతో కరచాలనం చేశారు, చిరునవ్వులు చిందించారు పవార్. దీంతో INDIA కూటమి నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఒకరంటే ఒకరికి పడదు, ఇద్దరూ విమర్శలు చేసుకుంటారు, అయినా కూడా ఇలా కలవడానికి బుద్ధిలేదా అని ప్రశ్నించారు శివసేన ఉద్ధవ్ వర్గం నేత సంజయ్ రౌత్. శివసేన పత్రిక సామ్నాలో కూడా వారి కలయికపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఎన్సీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేసిన బీజేపీ, చివరకు ఆ పార్టీని చీల్చి తమ కూటమిలో కలిపేసుకుందని, అలాంటి బ్లాక్ మెయిలింగ్ పార్టీ దగ్గరకు శరద్ పవార్ ఎందుకు వెళ్లారంటూ ప్రశ్నించారు.
శరద్ పవార్ వ్యూహమేంటి..?
ఈ కలయికను రాజకీయాలతో ముడిపెట్టొద్దంటూ కొద్దిరోజుల క్రితమే శరద్ పవార్ వర్గం ప్రకటించింది. బాలగంగాధర తిలక్ కార్యక్రమం కాబట్టే తాను హాజరవుతున్నానని చెప్పారు శరద్ పవార్. అయితే స్టేజ్ పై మోదీ ఆత్మీయ కరచాలనం, పలకరింపు.. అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాయి. మోదీతో పవార్ కూడా అంతే అభిమానంగా మాట్లాడటంతో INDIA కూటమిలో కలవరం మొదలైంది.
ఇప్పటికే ఎన్సీపీలో మెజార్టీ శాసన సభ్యుల్ని ఎన్డీఏ కూటమిలో చేర్చారు అజిత్ పవార్. ఎన్సీపీని చీల్చడం తమకు ఇష్టం లేదంటూనే అధికార కూటమితో కలిశారు. అందరం ఎన్డీఏతోనే కలసి ఉందామంటూ రెండుసార్లు శరద్ పవార్ వద్దకు రాయబారం కూడా నడిపారు. బీజేపీతో చేతులు కలిపేందుకు ససేమిరా అని చెప్పిన శరద్ పవార్.. ఇప్పుడు మోదీతో కలసి తిలక్ కార్యక్రమానికి హాజరు కావడం మాత్రం ఆసక్తిగా మారింది. అధికారాన్ని కోల్పోయినప్పటినుంచి మహావికాస్ అఘాడీ చీలిక పేలికలుగా మారుతోంది. ఈ దశలో శరద్ పవార్ INDIA కూటమిలో కొనసాగుతారా లేదా అనేది వేచి చూడాలి.