తమిళనాడు ఆలయాల్లో సెల్ ఫోన్లపై నిషేధం..

గుడిలోకి వెళ్లినవారు చిత్తం శివుడిపై పెట్టకపోగా భక్తినంతా సెల్ ఫోన్ పై పెడుతున్నారు. ఆలయంలోకి వెళ్లి దేవుడిని దర్శించడంకంటే ముందు సెల్ ఫోన్ తీసి గోడలపై చిత్రాలను ఫొటోలు తీసుకుంటున్నారు.

Advertisement
Update:2022-12-03 13:38 IST

దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఆలయాలలోకి సెల్ ఫోన్లు తీసుకెళ్లడం నిషేధం. గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం, తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి కూడా సెల్ ఫోన్లు తీసుకెళ్లనివ్వరు. కొన్నిచోట్ల సెల్ ఫోన్ లను అనుమతించినా, వాటిని బయటకు తీయొద్దని చెబుతుంటారు. దేవుడు ఎక్కడైనా దేవుడే కదా, ప్రముఖ ఆలయాల్లో విధించిన నిషేధం చిన్న ఆలయాలకు ఎందుకు వర్తించదని ప్రశ్నిస్తున్నారు కొంతమంది. తమిళనాడులో తూత్తుకుడిలోని తిరుచెందూర్ శ్రీ సుబ్రమణ్య స్వామి ఆలయానికి సంబంధించి సెల్ ఫోన్లను నిషేధించాలంటూ సీతారామన్ అనే వ్యక్తి మద్రాస్ హైకోర్ట్ లో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు తిరుచెందూర్ సహా ఇతర ఆలయాల్లో కూడా సెల్ ఫోన్లపై నిషేధం విధించాలని, ఆ దిశగా ఆదేశాలివ్వాలని అధికారులకు సూచించింది.

చిత్తం శివుడిపై భక్తి సెల్ ఫోన్ పై..

చిత్తం శివుడి మీద, భక్తి చెప్పులమీద అనేది పాత సామెత. కానీ ఇప్పుడు గుడిలోకి వెళ్లినవారు చిత్తం శివుడిపై పెట్టకపోగా భక్తినంతా సెల్ ఫోన్ పై పెడుతున్నారు. ఆలయంలోకి వెళ్లి దేవుడిని దర్శించడంకంటే ముందు సెల్ ఫోన్ తీసి గోడలపై చిత్రాలను ఫొటోలు తీసుకుంటున్నారు. సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తుంటారు. ప్రశాంతత, ఏకాగ్రతకోసం ఆలయాలకు వెళ్లేవారికి ఇలాంటి వీడియోలు, ఫొటోలు చికాకుగా అనిపిస్తుంటాయి. అదే సమయంలో ఆడవారి భద్రతకు కూడా ఇది విఘాతం కలిగిస్తుందని అంటున్నారు పూజారులు. మహిళల అనుమతి లేకుండా వారిని ఫొటోలు, వీడియోలు తీస్తున్నారని, ఇది మరో ఇబ్బందికి దారితీస్తోందని చెబుతున్నారు. ఈ వివరాలన్నిటినీ పిల్ లో పొందుపరిచారు సీతారామన్.

దేవాలయ ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా ఆలయాల్లో ఫొటోలు, వీడియోలు తీయడం నిషేధించాలని పిటిషనర్ మద్రాస్ హైకోర్టుని కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఆమేరకు నిషేధం అమలు చేయాలంటూ మదురై బెంచ్ హిందూ రెలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ శాఖను ఆదేశించింది. భక్తుల భద్రతతో పాటు ఆలయ పవిత్రతను కాపాడేందుకు ఆలయ ప్రాంగణం లోపల సెల్ ఫోన్లపై నిషేధాన్ని విధించేలా అధికారుల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు న్యాయమూర్తులు. ఫోన్లు, కెమెరాలు భక్తుల దృష్టిని మరల్చుతాయని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News