నెలసరి సెలవులు.. స్మృతి ఇరానీ వ్యాఖ్యలపై కవిత అసంతృప్తి
నెలసరి మనకున్న ఎంపిక కాదు, అదొక సహజమైన జీవ ప్రక్రియ.. అని ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేశారు. వేతనంతో కూడిన సెలవును తిరస్కరించడమంటే, దేశంలోని మహిళల బాధను విస్మరించినట్లేనని చెప్పారు కవిత.
భారత్ ఉద్యోగాలు చేసే మహిళలకు నెలసరి సమయంలో సెలవులు ఇచ్చే ప్రతిపాదనను కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ తిరస్కరించడం సరికాదన్నారు ఎమ్మెల్సీ కవిత. ఒక మహిళగా ఆమె అలాంటి వాఖ్యలు చేయకూడదని చెప్పారు. నెలసరి సమయంలో మహిళలు పడే బాధను గమనించి సెలవు మంజూరు చేయాలని కోరాల్సిన మహిళా మంత్రి.. దాన్ని వ్యతిరేకించడం ఎంతమాత్రం సమంజసం కాదని చెప్పారు కవిత. మహిళల బాధ పట్ల ఇలాంటి నిర్లక్ష్యాన్ని చూడాల్సి వస్తున్నందుకు మహిళగా బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. నెలసరి మనకున్న ఎంపిక కాదు, అదొక సహజమైన జీవ ప్రక్రియ.. అని ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేశారు. వేతనంతో కూడిన సెలవును తిరస్కరించడమంటే, దేశంలోని మహిళల బాధను విస్మరించినట్లేనని చెప్పారు కవిత.
స్మృతి ఇరానీ ఏమన్నారు..?
మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులు ఇచ్చే ప్రతిపాదనను ఇటీవల కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ వ్యతిరేకించారు. రాజ్యసభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళకు నెలసరి అనేది వైకల్యం కాదని, ఆమె జీవితంలో అదొక సహజ ప్రక్రియ అని.. నెలసరి సెలవలు అనేవి, పని ప్రదేశంలో వివక్షకు దారితీయొచ్చని చెప్పారు స్మృతి ఇరానీ. గతంలో కూడా ఆమె ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తిపరిచారు. మహిళలకు నెలసరి సెలవులు అవసరం లేదని ఆమె తేల్చి చెప్పారు.
భారత్ లో నెలసరి సెలవులను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం బీహార్. ఆ రాష్ట్రంలో 1992 నుంచి ప్రభుత్వ మహిళా ఉద్యోగినులకు నెలకు రెండు రోజులు నెలసరి సెలవు ఇస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లో ఇలాంటి ప్రత్యేక వెసులుబాట్లు లేవు. ఇక ప్రైవేటు కంపెనీల విషయానికొస్తే.. భారత్ లో స్విగ్గీ, జొమాటో, బైజూస్, కల్చర్ మెషీన్ వంటి సంస్థలు మహిళలకు నెలసరి సెలవులను అందిస్తున్నాయి. సెలవు రోజుల్లో పనిచేస్తే అదనపు వేతనం అందిస్తారు. దక్షిణకొరియా, ఇండోనేషియా, తైవాన్, జపాన్, జాంబియా దేశాల్లో కూడా ఇలాంటి సెలవులు ఉన్నాయి. భారత్ లో కూడా దేశవ్యాప్తంగా నెలసరి సెలవుల కోసం డిమాండ్లు పెరుగుతున్నాయి. అయితే కేంద్రం మొహమాటం లేకుండా ఆ ప్రతిపాదన తోసిపుచ్చడం విశేషం.