రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే మళ్లీ మంత్రిగా ప్రమాణం

దీంతో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. అయితే తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సాజి చెరియన్ ను మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

Advertisement
Update:2023-01-04 20:00 IST

డాక్టర్ బీఆర్‌.అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాతే భారత్ సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగ అవతరించింది. అంతటి విలువైన రాజ్యాంగంపై కేరళకు చెందిన ఓ మంత్రి కొన్ని నెలల కిందట అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత తలెత్తిన పరిణామాల నేపథ్యంలో మంత్రి పదవిని కోల్పోయాడు. అయితే ఆరు నెలలు కూడా గడువక ముందే మళ్లీ ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి కట్టబెట్టడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కేరళలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వంలో సాజి చెరియన్ సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉండేవారు. ఆయన గత జూన్ లో రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

సామాన్య ప్రజల దోపిడీని రాజ్యాంగం సమర్థిస్తోందని, ప్రజలను దోచుకునేలా రాజ్యాంగం రాయబడిందని ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని సృష్టించాయి. సాజి చెరియన్ వ్యాఖ్యలను అప్పట్లో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ తీవ్రంగా ఖండించాయి. రోడ్లపైకి వచ్చి ఆందోళనలు జరిపాయి. ప్రజల నుంచి కూడా తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి.

ఈ నేపథ్యంలో ఆయనపై క్రిమినల్ కేసు నమోదయింది. దీంతో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. అయితే తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సాజి చెరియన్ ను మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. సాజి చెరియన్ ను తిరిగి మంత్రి వర్గంలోకి తీసుకునేందుకు అనుమతించాలని ముఖ్యమంత్రి పినరయి గత నెల 30వ తేదీన రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కు ఒక ప్రతిపాదన పంపారు. అయితే ఆ ప్రతిపాదనకు గవర్నర్ అభ్యంతరం తెలిపారు.

అయినా పినరయి పట్టువదల్లేదు. పట్టుబట్టి మరీ మంగళవారం గవర్నర్ చేత ఆమోద ముద్ర వేయించుకున్నారు. ఇవాళ జరిగిన కార్యక్రమంలో సాజి చెరియన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గవర్నర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రిగా ఉండి బాధ్యతగా మెలగాల్సిన ఒక వ్యక్తి రాజ్యాంగంపై తీవ్ర విమర్శలు చేశారు. అటువంటి వ్యక్తికి ఆరు నెలలు కూడా గడవకముందే మళ్లీ మంత్రి పదవిని కట్టబెట్టడంపై ప్రజలు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News