అక్కడ.. పెళ్లాడినా పోక్సో కేసే.. - నిందితులకు యావజ్జీవ ఖైదు..!
ఇకపై 14 ఏళ్ల లోపు బాలికలను వివాహం చేసుకునేవారిపై పోక్సో కేసు నమోదు చేయాలని అసోం ప్రభుత్వం చట్టం చేస్తోంది. ఈ కేసు కింద నిందితులకు యావజ్జీవ శిక్ష విధించే అవకాశముంది.
అక్కడ మాతాశిశు మరణాల రేటు ఎక్కువగా ఉంది.. బాల్య వివాహాలే దీనికి ప్రధాన కారణమని ఆ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వచ్చే ఐదేళ్లలో బాల్య వివాహాలను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు కఠిన నిర్ణయం తీసుకుంది. అనుకున్నదే తడవుగా కేబినెట్‌లోనూ ఆమోదించేసింది. ఇకపై 14 ఏళ్ల లోపు బాలికలను వివాహం చేసుకునేవారిపై పోక్సో కేసు నమోదు చేయాలని చట్టం చేస్తోంది. ఈ కేసు కింద నిందితులకు యావజ్జీవ శిక్ష విధించే అవకాశముంది.
ఈ నిర్ణయం తీసుకున్న రాష్ట్రం అస్సాం. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అస్సాంలో మాతాశిశు మరణాల రేటు ఎక్కువగా ఉందని ఆయన చెప్పారు. దీనికి ప్రధాన కారణం బాల్య వివాహాలేనని గుర్తించామని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో బాల్య వివాహాలను పూర్తి స్థాయిలో నిర్మూలించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
14 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు బాలికలను వివాహం చేసుకునేవారిని బాల్య వివాహాల నిరోధక చట్టం కింద శిక్షించనున్నట్టు సీఎం వివరించారు. ఒకవేళ 14 ఏళ్లలోపు బాలికలను అదే వయసులోపు బాలురు వివాహం చేసుకుంటే.. ఎలాంటి చర్యలు తీసుకుంటారనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. అలాంటి వివాహాలను చట్టవిరుద్ధంగా ప్రకటిస్తామని చెప్పారు. బాలురను జువైనల్ హోమ్‌కు తరలిస్తామని తెలిపారు.