కాందార్-లోహలో బీఆర్ఎస్ బహిరంగ సభ కోసం భారీ ఏర్పాట్లు

కేసీఆర్ నాందేడ్‌లో పర్యటించిన తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది.

Advertisement
Update:2023-03-23 08:33 IST

భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, సీఎం కేసీఆర్ పొరుగున ఉన్న మహారాష్ట్రపై ఎక్కువగా దృష్టి పెట్టారు. ఆ రాష్ట్రంలో పార్టీ విస్తరణకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే నాందేడ్‌లో సభ విజయవంతం కావడంతో.. కాందార్-లోహలో మరో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. తెలుగువాళ్లు.. ముఖ్యంగా తెలంగాణ నుంచి వెళ్లి స్థిరపడిన వాళ్లు కాందార్ ప్రాంతంలో ఎక్కువగా ఉండటంతో వారిని బీఆర్ఎస్ పట్ల ఆకర్షితులను చేయడానికి ఈ నెల 26న బహిరంగ సభ నిర్వహించనున్నది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను బీఆర్ఎస్ నాయకులు యుద్ద ప్రాతిపదికన చేస్తున్నారు.

కేసీఆర్ నాందేడ్‌లో పర్యటించిన తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది. బీఆర్ఎస్ రైతు బంధు పేరుతో తెలంగాణలో ఎప్పటి నుంచో ఈ పథకాన్ని అమలు చేస్తోంది. మహారాష్ట్రలో రైతులకు ఈ సాయం అందించాలని సీఎం కేసీఆర్ ప్రతిపాదించారు. ఆ తర్వాత కొన్ని రోజులకే మహాప్రభుత్వం రైతు సాయం ప్రకటించడం గమనార్హం. కేసీఆర్ పర్యటన తర్వాతే తమకు మేలు జరిగిందని అక్కడ రైతులు భావిస్తున్నారు.

కేసీఆర్ నాందేడ్ పర్యటన తర్వాత పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. అక్కడి రైతుల్లో తెలంగాణ మోడల్ గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మహారాష్ట్రలో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తే ఒక ప్రభావ శక్తిగా అవతరించే వీలుంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభావంతోనే అక్కడి పెట్టుబడి సాయం అందించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందని రైతులు బలంగా నమ్ముతున్నారు. బీఆర్ఎస్ కిసాన్ విభాగం కూడా మహారాష్ట్రలో కార్యక్రమాలు చేపడుతోంది.

మహారాష్ట్రలోని కాందార్-లోహా బహిరంగ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ, మహారాష్ట్ర కిసాన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదమ్‌లు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే జన సమీకరణ కోసం భారీ ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంట్, కల్యాణ లక్ష్మీ, ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్ వంటి పథకాలతో రూపొందించిన వీడియోలను మహారాష్ట్ర కిసాన్ సమితి విభాగం ఆధ్వర్యంలో పల్లెపల్లెలో ప్రదర్శిస్తున్నారు. మరాఠీ, హిందీ భాషల్లో ఈ వీడియోలను రూపొందించారు. కందార్ సమీప ప్రాంతాలైన నాందేడ్, పూర్ణ, పాలెం, ఆర్దర్‌పూర్, అహ్మద్ పూర్ తదితర ప్రాంతాల్లో ప్రచార రధాల ద్వారా తెలంగాణ మాడల్‌పై ప్రచారం చేస్తున్నారు.

సీఎం కేసీఆర్ నాందేడ్ సభ తర్వాత అక్కడి రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ చేస్తున్న కార్యక్రమాలను గమనిస్తున్నాయి. ఇప్పటికే పలు రాజకీయ పార్టీ నాయకులు, ఇతర రంగాలకు చెందిన మేధావులు బీఆర్ఎస్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా రైతు విభాగాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన 'అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' నినాదాన్ని మహారాష్ట్ర అంతటా విస్తృతంగా ప్రచారం చేశారు. 26న సభలోపు ఇతర పార్టీలకు చెందిన నాయకులను కూడా బీఆర్ఎస్‌లో చేర్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం సమక్షంలో కూడా 26న పార్టీ నేతలు బీఆర్ఎస్‌లో చేరతారని సమాచారం. మొత్తానికి కందార్-లోహ సభ విజయవంతానికి బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభ తర్వాత మహారాష్ట్రలో మరింతగా పార్టీ ప్రజల్లోకి వెళ్తుందని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News