ఈ ఏడాది కొత్త మారుతీ కార్ కొన్నారా..? అయితే ఇది మీకోసమే..

2022 డిసెంబరు 8 నుంచి 2023 జనవరి 12 మధ్య తయారైన కార్ల ఎయిర్‌ బ్యాగ్‌ కంట్రోలర్‌ లో లోపం ఉండే అవకాశం ఉందని మారుతీ సుజుకీ సంస్థ ప్రకటించింది. మొత్తం 17,362 కార్లలో లోపం ఉన్నట్టు నిర్థారించిన కంపెనీ వాటిని రీకాల్ చేస్తోంది.

Advertisement
Update:2023-01-18 16:40 IST

కొత్త ఏడాది కొత్త మారుతీ కార్ కొన్నారా? లేక 2022 చివర్లో ఇయర్ ఎండింగ్ సేల్ ఆఫర్ లో మారుతీ కార్ బుక్ చేశారా..? అయితే ఈ హెచ్చరిక మీకోసమే. మారుతీ సుజుకీ కంపెనీకి చెందిన కొన్ని మోడళ్లలో ఎయిర్ బ్యాగ్ వ్యవస్థలో లోపం ఉన్నట్టు గుర్తించారు. కంపెనీ దీనిపై విస్తృత పర్యవేక్షణ చేసి ఆ లోపాలను నిర్థారించింది. ఆయా కార్లను తిరిగి సర్వీస్ స్టేషన్లకు తీసుకుని వస్తే లోపాలను సవరించి ఇస్తామని చెబుతోంది.

2022 డిసెంబరు 8 నుంచి 2023 జనవరి 12 మధ్య తయారైన కార్ల ఎయిర్‌ బ్యాగ్‌ కంట్రోలర్‌ లో లోపం ఉండే అవకాశం ఉందని మారుతీ సుజుకీ సంస్థ ప్రకటించింది. మొత్తం 17,362 కార్లలో లోపం ఉన్నట్టు నిర్థారించిన కంపెనీ వాటిని రీకాల్ చేస్తోంది. వాటి యజమానులకు ఇప్పటికే కాల్స్ చేయడం మొదలుపెట్టింది. అయితే దీనిపై పుకార్లు మొదలై.. కస్టమర్లు గందరగోళ పడకుండా ముందుగానే ప్రకటన విడుదల చేసింది. ఫలానా మోడళ్లు, ఫలానా తేదీల మధ్య తయారైన కార్లను మాత్రమే తీసుకు రావాలని చెప్పింది.

ఇంతకీ ఏంటా కార్లు..?

ఆల్టో కె-10, బ్రీజా, బ్యాలెనో, ఎస్‌-ప్రెసో, ఈకో, గ్రాండ్‌ విటారా మోడళ్లలో కొన్నింటిలో ఎయిర్‌ బ్యాగ్‌ కంట్రోలర్‌ లో లోపం ఉన్నట్టు గుర్తించింది కంపెనీ. ప్రమాదం జరిగినప్పుడు అరుదుగా ఎయిర్‌ బ్యాగ్‌ లు ఓపెన్ కాకపోవడం, సరిగ్గా సీట్ బెల్ట్ లు పనిచేయకపోవడం లాంటి సమస్యలు ఎదురవుతాయని తెలిపింది. ఆ సమస్యలు పరిష్కరించే వరకు కార్లను నడపొద్దని పేర్కొంది. వెంటనే సర్వీస్ స్టేషన్లకు తీసుకు రావాలని పిలుపునిచ్చింది. ఈమేరకు కస్టమర్లకు ఈపాటికే కాల్స్ వెళ్లాయని పేర్కొంది మారుతి-సుజుకి సంస్థ. లోపం ఉన్న కార్లకు మరమ్మతులు చేసి తిరిగి కస్టమర్లకు అప్పగిస్తామని పేర్కొంది. కస్టమర్లు ఎలాంటి డబ్బులు చెల్లించకుండానే కార్ల తనిఖీ, మరమ్మతు ప్రక్రియను పూర్తి చేస్తామని స్పష్టం చేసింది.

Tags:    
Advertisement

Similar News