ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వా..

రాష్ట్రపతి అభ్యర్థిగా మహిళపై పురుష అభ్యర్థిని బరిలో దింపిన విపక్షాలు, ఇప్పుడు ఉపరాష్ట్రపతి రేసులో జగదీప్ ధనకర్ పై మహిళను పోటీగా నిలబెట్టారు. పోటీలో ఉన్న జగదీప్ ధన కర్, మార్గరెట్ అల్వా.. ఇద్దరూ లాయర్లు కావడం, మాజీ గవర్నర్లు కావడం విశేషం.

Advertisement
Update:2022-07-18 07:01 IST

ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా ఏకగ్రీవం అయ్యేలా లేదు. అధికార ఎన్డీఏకి ఆధిక్యం స్పష్టంగా ఉన్నా కూడా విపక్షాలు అభ్యర్థిని బరిలో దింపాయి. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన కర్ ని ప్రకటించిన మరుసటి రోజు.. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి మార్గరెట్ అల్వా పేరు ఎంపిక చేశారు. ఈమేరకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆమెను విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించారు. మంగళవారం అల్వా నామినేషన్ దాఖలు చేస్తారు. 17 పార్టీలు ఏకగ్రీవంగా ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరిచాయి.

1942 ఏప్రిల్‌ 14న కర్నాటకలోని మంగళూరులో జన్మంచిన మార్గరెట్‌ అల్వా.. బెంగళూరులోని మౌంట్‌ కార్మెల్‌ కాలేజీలో డిగ్రీ చదివారు. గవర్నమెంట్ లా కాలేజీలో న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. విద్యార్థి ఉద్యమాల్లోనూ పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1964లో వివాహం తర్వాత.. గృహిణిగా కొత్త జీవితం ప్రారంభించి ఆ తర్వాత ఐదేళ్లకు రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. ఆమెకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున 1974లో తొలిసారి రాజ్యసభకు ఎంపికయ్యారు. ఆ తర్వాత 1980, 1986, 1992లలో వరుసగా రాజ్యసభకు ఎన్నికవుతూ వచ్చారు. కేంద్ర మంత్రిగానూ సేవలందించారు. 1999లో ప్రత్యక్ష రాజకీయాల్లోనూ సత్తా చూపారు. ఉత్తర కన్నడ నియోజకవర్గం నుంచి గెలిచి లోక్ సభలో అడుగు పెట్టారు. 2004 నుంచి 2009 వరకు ఆమె కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆ తర్వాత ఆమె వివిధ రాష్ట్రాలకు గవర్నర్ గా కూడా పనిచేశారు గోవా, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు గవర్నర్ గా సేవలందించారు. లోక్ సభ ఎంపీ, రాజ్యసభ ఎంపీ, కేంద్ర మంత్రి, గవర్నర్.. ఇలా వివిధ ఉన్నత పదవుల్ని అలంకరించిన మార్గరెట్ అల్వా ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వార్తల్లోకెక్కారు.

రాష్ట్రపతి అభ్యర్థిగా మహిళపై పురుష అభ్యర్థిని బరిలో దింపిన విపక్షాలు, ఇప్పుడు ఉపరాష్ట్రపతి రేసులో జగదీప్ ధనకర్ పై మహిళను పోటీగా నిలబెట్టారు. పోటీలో ఉన్న జగదీప్ ధన కర్, మార్గరెట్ అల్వా.. ఇద్దరూ లాయర్లు కావడం, మాజీ గవర్నర్లు కావడం విశేషం. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీ కాలం ఆగస్టు 10తో ముగుస్తుంది. ఆగస్టు 6నే కొత్త ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాయి. ఇక విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా తనను ఎంపిక చేయడం పట్ల మార్గరెట్‌ అల్వా ట్విట్టర్‌ లో స్పందించారు. తనను ఎంపిక చేయడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని.. విపక్షాల నిర్ణయాన్ని వినయంతో అంగీకరిస్తున్నట్టు పేర్కొన్నారు. తనపట్ల విశ్వాసం ఉంచిన విపక్షాల నేతలందరికీ కృతజ్ఞతలు చెబుతున్నట్టు ఆమె ట్వీట్‌ చేశారు.

Tags:    
Advertisement

Similar News