ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా రాజీనామా.. ఆమోదించిన సీఎం కేజ్రివాల్
ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించి గరిష్టంగా ఏడుగురిని మంత్రులుగా నియమించుకునే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడంతో సీఎం కేజ్రివాల్ కేబినెట్ పునర్వవస్థీకరణ చేస్తారని ఆప్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఢిల్లీకి చెందిన ఇద్దరు మంత్రులు మంగళవారం తమ పదవులకు రాజీనామా చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ 2021-22 (ఇప్పుడు రద్దు అయ్యింది)కి సంబంధించి జరిగిన అవకతవకల్లో డిప్యూటీ సీఎం మనీశ్ సిపోడియా కీలక పాత్ర పోషించారని చెబుతూ సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. లిక్కర్ పాలసీకి సంబంధించిన స్కామ్‌ను దర్యాప్తు చేస్తున్న సీబీఐకి.. మనీశ్ సరైన వివరాలు అందించలేదనే కారణంతో అరెస్టు చేశారు. కాగా, తన అరెస్టుపై స్టే విధించాలని కోరుతూ మనీశ్ సిపోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
లిక్కర్ పాలసీని రూపొందించడంలో అనేక మంది పాత్ర ఉంటుందని.. అంతే కాకుండా ఇందులో ఎలాంటి డబ్బును రికవర్ చేయలేదని సిసోడియా తరపు న్యాయవాది ఏఎం సింగ్వీ సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలిపారు. అయితే ఈ కేసు విచారిస్తున్న సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎం నరసింహ ధర్మాసనం స్టే ఇవ్వడానికి నిరాకరించింది. నేరుగా సుప్రీంకోర్టుకు రావడానికి ఎలాంటి అర్హత లేదని.. స్టే కావాలంటే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది.
సుప్రీంకోర్టులో స్టే రాని నేపథ్యంలో మనీశ్ సిసోడియా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. సిసోడియా వద్ద ప్రస్తుతం 18 పోర్ట్ ఫోలియోలు ఉన్నాయి. ఆయన డిప్యూటీ సీఎంగా వ్యవహరించడమే కాకుండా కీలకమైన వైద్యారోగ్య శాఖను కూడా చూసుకుంటున్నారు.
మరోవైపు గతేడాది నుంచి తీహార్ జైలులో ఉన్న మరో మంత్రి సత్యేంద్ర జైన్ కూడా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. గత 10 నెలల నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఆయనపై పలు అభియోగాలు మోపింది. ఢిల్లీలో వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా.. కేజ్రివాల్ ప్రభుత్వంలో సీనియర్ మంత్రిగా ఉన్నారు. ఆయన కూడా ఇవ్వాళ రాజీనామా చేశారు. సత్యేంద్ర జైన్, మనీశ్ సిసోడియాల రాజీనామాలను కేజ్రివాల్ ఆమోదించారు.
ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించి గరిష్టంగా ఏడుగురిని మంత్రులుగా నియమించుకునే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడంతో సీఎం కేజ్రివాల్ కేబినెట్ పునర్వవస్థీకరణ చేస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఐదుగురు మంత్రులు ఉండటంతో.. మరో ఇద్దరు కొత్త వారికి చోటు దక్కే అవకాశం ఉన్నది.