96 గుర్తు తెలియని శవాలు.. 5 వేలకు పైగా ఆయుధాలు చోరీ.. మణిపూర్ రిపోర్టు..!
రాష్ట్ర వ్యాప్తంగా 5 వేలకు పైగా నివాసాలను తగలబెట్టిన కేసులు నమోదయ్యాయి. ఇందులో 4,786 ఇళ్లకు సంబంధించిన కేసులు కాగా, 386 మతపరమైన ప్రదేశాలకు సంబంధించినవి ఉన్నాయి.
అల్లర్లు, హింసాత్మక ఘటనలతో అట్టుడికిపోయిన మణిపూర్‌కు సంబంధించి సంచలన విషయాలు వెల్లడించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. అల్లర్లు ప్రారంభమైన మే 3వ తేదీ నుంచి ఇప్పటివరకూ 175 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 1,118 మంది గాయపడ్డారని తేల్చింది. 33 మంది ఆచూకీ ఇప్పటికీ లభించలేదని రిపోర్టులో వెల్లడించింది. ఇక 96 డెడ్‌బాడీలు ఎవరు క్లెయిమ్ చేసుకోకపోవడంతో మార్చురీల్లో పడి ఉన్నాయని స్పష్టం చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా 5 వేలకు పైగా నివాసాలను తగలబెట్టిన కేసులు నమోదయ్యాయి. ఇందులో 4,786 ఇళ్లకు సంబంధించిన కేసులు కాగా, 386 మతపరమైన ప్రదేశాలకు సంబంధించినవి ఉన్నాయి. అల్లర్లు ప్రారంభమైన నాటి నుంచి రాష్ట్ర ఆయుధశాల నుంచి 5,668 ఆయుధాలను నిరసనకారులు ఎత్తుకెళ్లారని రిపోర్టులో వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకారులు ఏర్పాటు చేసిన 360 బంకర్లను ధ్వంసం చేసినట్లు తెలిపారు పోలీసులు.
మణిపూర్ జనాభాలో 53 శాతం ఉన్న మెయితీలు ఎక్కువగా ఇంఫాల్ లోయలో నివసిస్తున్నారు. నాగాలు, కుకీలు సహా ఇతర గిరిజనులు 40 శాతంగా ఉన్నారు. వీరంతా కొండ ప్రాంతాల్లోని జిల్లాల్లో నివసిస్తున్నారు. ఎస్టీ హోదా కోసం మెయితీ కమ్యూనిటీ డిమాండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ మే 3న నిర్వహించిన ఆదివాసీ సాలిడారిటీ మార్చ్ హింసాత్మకంగా మారింది. ఈ అల్లర్లు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు.