రేపే ఖర్గే ప్రమాణ స్వీకారం.. విధేయత మినహా ఇంకేమైనా ఆశించొచ్చా..?
ఒకవేళ ఖర్గేకి పూర్తి స్వేచ్ఛనిచ్చి, పార్టీ పునర్నిర్మాణం జరిగితే మాత్రం కాంగ్రెస్‌కి మంచిరోజులొచ్చే అవకాశాలున్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీపై వ్యతిరేకత పెరిగిపోతున్న వేళ, ఇది కాంగ్రెస్‌కి మంచి అవకాశంగా మారుతుంది.
విధేయతకు వీరతాడు పడుతోంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) అధ్యక్షుడిగా రేపు మల్లికార్జున్ ఖర్గే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో అంచనాలను తలకిందులు చేసే పరిణామాలేవీ జరగకపోవడంతో శశిథరూర్‌పై ఖర్గే 84 శాతం ఓట్ల తేడాతో విజయం సాధించారు. బుధవారం పార్టీ అధ్యక్షుడిగా ఖర్గే బాధ్యతలు స్వీకరిస్తారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పగ్గాలు చేపడతారు.
కాంగ్రెస్ భవిష్యత్తు మారుతుందా..?
పార్టీ పగ్గాలు తాను చేపట్టబోనంటూ రాహుల్ గాంధీ భీష్మించడంతో ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి. అయితే ఎన్నికల్లో గాంధీ కుటుంబ విధేయతే గెలిచింది. అంటే అధ్యక్ష పదవిలో ఖర్గే ఉన్నా కూడా నిర్ణయాలన్నీ సోనియా, రాహుల్ అభిమతానికి అనుగుణంగానే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇటీవల రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చూస్తుంటే పార్టీపై నిర్ణయాధికారాలన్నీ ఆయన అధ్యక్షుడికే వదిలేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్ జోడో యాత్రలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. పలు రాష్ట్రాల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలలో కీలక విషయాలపై పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అంటే పార్టీ విషంలో ఖర్గేకి ఫ్రీ హ్యాండ్ ఇస్తారా అనేది ముందు ముందు తేలిపోతుంది.
ఎన్నిక వరకు ఎలాంటి సంచలనాలు లేకుండా జరిగింది. మరి ఖర్గే పగ్గాలు చేపట్టాక కూడా పాత పద్ధతులే అమలైతే మాత్రం ఈ ఎన్నికలతో ఎలాంటి ప్రయోజనం లేదనే చెప్పాలి. ఒకవేళ ఖర్గేకి పూర్తి స్వేచ్ఛనిచ్చి, పార్టీ పునర్నిర్మాణం జరిగితే మాత్రం కాంగ్రెస్‌కి మంచిరోజులొచ్చే అవకాశాలున్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీపై వ్యతిరేకత పెరిగిపోతున్న వేళ, ఇది కాంగ్రెస్‌కి మంచి అవకాశంగా మారుతుంది.
ఇక ఏఐసీసీ ఆఫీస్‌లో జరిగే ఖర్గే ప్రమాణ స్వీకారోత్సవాన్ని పెద్ద ఎత్తున జరపాలనుకుంటున్నారు. అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, మాజీ పీసీసీలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల మంత్రులు, ఇతర రాష్ట్రాల సీఎల్పీ నాయకులు, ఏఐసీసీ ఆఫీస్ బేరర్లు, మాజీ ముఖ్యమంత్రులు, మాజీ కేంద్ర మంత్రులు, ఎంపీలు.. ఇలా అందరూ ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో ఒకరకంగా కాంగ్రెస్ శ్రేణుల్లో చురుకు మొదలైంది. నిస్తేజంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా రాహుల్‌ని చూసేందుకు, ఆయనతో కలసి నడిచేందుకు యువత ఉత్సాహం చూపించారు. చాన్నాళ్ల నుంచి స్తబ్దుగా ఉన్న నేతలు కూడా ఏపీలో రాహుల్‌ని కలిసేందుకు వచ్చారు, తామింకా కాంగ్రెస్‌లోనే ఉన్నామని చెప్పుకున్నారు.