తెలంగాణ మోడల్‌ను అధ్యయనం చేయడానికి కమిటీని ఏర్పాటు చేయనున్న మహారాష్ట్ర ప్రభుత్వం
ఈ కమిటీలో రైతు సంఘాల ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉంటారు. పథకాల అమలుకు అయ్యే ఖర్చుతో సహా అన్ని అవకాశాలను అధ్యయనం చేస్తారు.కమిటీ తన నివేదికను సమర్పించడానికి నెల రోజుల గడువును కూడా నిర్దేశిస్తున్నట్లు వినాయకరావు పాటిల్ తెలిపారు.
తెలంగాణలో అమలవుతున్నట్టు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతు బంధు, రైతు బీమా, తెలంగాణలో ఇస్తున్న విధంగా వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన కనీస మద్దతు ధర ఇవ్వాలని, తెలంగాణ మోడల్ ను అమలు చేయాలని కొంత కాలంగా మహారాష్ట్రలో రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్ తో ప్రముఖ సామాజిక కార్యకర్త వినాయకరావు పాటిల్ నిరహార దీక్ష కూడా చేపట్టారు.
రైతులు, రైతు సంఘాల నుండి పెరుగుతున్న ఒత్తిడికి తలొగ్గిన మహా రాష్ట్ర ముఖ్యమంత్ర్ ఏక్ నాథ్ షిండే నిన్న ముంబైలో 14 రైతు సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అబ్దుల్ సత్తార్ నబీ, విద్యుత్, రెవెన్యూ, వ్యవసాయం తదితర శాఖల కార్యదర్శులు, రైతు సంఘం నాయకులు రాజుశెట్టి, పంజాబ్రావ్ పాటిల్, సికందర్ షాతో పాటు తెలంగాణ మోడల్‌ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇటీవల నిరాహారదీక్ష చేసిన వినాయకరావు పాటిల్ లు పాల్గొన్న ఈ సమావేశంలో తెలంగాణ మోడల్ ను అధ్యయనం చేయడానికి ఓ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఈ కమిటీలో రైతు సంఘాల ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉంటారు. పథకాల అమలుకు అయ్యే ఖర్చుతో సహా అన్ని అవకాశాలను అధ్యయనం చేస్తారు.కమిటీ తన నివేదికను సమర్పించడానికి నెల రోజుల గడువును కూడా నిర్దేశిస్తున్నట్లు వినాయకరావు పాటిల్ తెలిపారు.
అయితే, కమిటీ నివేదికతో మాకు నమ్మకం కలగకపోతే, మేము మళ్ళీ ఆందోళనలు ప్రారంభిస్తామని, తెలంగాణ పథకాలను మహారాష్ట్రలో అమలు చేసే వరకు మేము వెనక్కి తగ్గబోమని, రెండు రోజుల్లో కమిటీ వివరాలను ప్రభుత్వం వెల్లడిస్తుందని వినాయకరావు పాటిల్ అన్నారు.
సమావేశంలో రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వాలని, తెలంగాణ రైతుబంధు తరహాలో ఇన్‌పుట్ సబ్సిడీ పథకం అమలు చేయాలని, రైతు బీమా తరహాలో రైతులకు బీమా సౌకర్యం కల్పించాలని, ప్రతినెలా 65 ఏళ్లు పైబడిన రైతులకు రూ. 5000, తెలంగాణలో ఇస్తున్న విధంగా వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన కనీస మద్దతు ధర ఇవ్వాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
“ఒక పాన్ షాప్ యజమాని కూడా ఎంతో కొంత లాభంతో పాన్‌ను విక్రయిస్తాడు, కాని రైతుకు మాత్రం లాభంతో తన ఉత్పత్తిని అమ్ముకునే అవకాశమే లేదు. రైతుల ఉత్పత్తి వ్యయాన్ని కలుపుకొని కొంత లాభ మార్జిన్‌తో ఎమ్‌ఎస్‌పిని ప్రకటించాలని బలంగా డిమాండ్ చేశాము. ”అని వినాయకరావు పాటిల్ చెప్పారు.
ఈ సమస్యలపై చర్చించడానికి త్వరలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రైతు సంఘాలు నిర్ణయించుకున్నాయి.
ఈ సమావేశం ప్రజలను పక్కదోవపట్టించే వ్యూహం కాబోదని, ఈసారి రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మహారాష్ట్రలోని ఇతర రైతులతో పాటు తాను ఆశిస్తున్నానని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ మహారాష్ట్ర నాయకుడు శంకర్ అన్నా ధోంగే అన్నారు.