నాందేడ్‌ ఆస్పత్రిలో వరుస మరణాలు.. మహారాష్ట్ర ప్రభుత్వం వింత సమాధానం!

లాంగ్‌ వీకెండ్‌ కారణంగా డాక్టర్‌ శంకర్‌ రావు చవాన్‌ ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌ సమీపంలోని ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ మూసి ఉన్నాయని, దీంతో పెద్ద ఎత్తున రోగులు నాందేడ్‌ ప్రభుత్వ ఆస్ప‌త్రికి వచ్చారని కోర్టుకు సమాధానం ఇచ్చేందుకు మహా సర్కార్‌ రెడీ అయిన‌ట్లు తెలుస్తోంది.

Advertisement
Update:2023-10-05 19:05 IST

మహారాష్ట్ర నాందేడ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో 72 గంటల వ్యవధిలో 31 మంది మరణించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో ఈ ఘటనపై సమగ్ర వివరణ ఇవ్వాలని ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వాన్ని బాంబే హైకోర్టు ఆదేశించింది. మందులు, సిబ్బంది కొరతను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిందను ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌పై తోసేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరణాలకు లాంగ్‌ వీకెండ్ కారణమని నివేదిక కూడా రెడీ చేసినట్లు సమాచారం.

లాంగ్‌ వీకెండ్‌ కారణంగా డాక్టర్‌ శంకర్‌ రావు చవాన్‌ ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌ సమీపంలోని ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ మూసి ఉన్నాయని, దీంతో పెద్ద ఎత్తున రోగులు నాందేడ్‌ ప్రభుత్వ ఆస్ప‌త్రికి వచ్చారని కోర్టుకు సమాధానం ఇచ్చేందుకు మహా సర్కార్‌ రెడీ అయిన‌ట్లు తెలుస్తోంది. ప్రైవేట్ హాస్పిటల్స్‌ క్రిటికల్ కేసులను ప్రభుత్వ ఆస్ప‌త్రికి రిఫర్‌ చేశాయని, అందుల్లో ఎక్కువగా నవజాత శిశువులే ఉన్నారని మహారాష్ట్ర ప్రభుత్వం నివేదిక తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే నాందేడ్ ఆస్ప‌త్రిలో మరణాల సంఖ్య పెరిగిందని కోర్టుకు చెప్పేందుకు ఏక్‌నాథ్ షిండే సర్కార్‌ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

మృతుల్లో 10 మంది నవజాత శిశువులు దగ్గర్లోని ప్రైవేట్ హాస్పిటల్స్‌ నుంచి నాందేడ్‌ హాస్పిటల్‌కు తీసుకువచ్చారని, అప్పటికే వారి పరిస్థితి చేయి దాటిపోయిందని మహారాష్ట్ర వైద్య శాఖ మంత్రి మష్రిఫ్‌ మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై తమ ప్రభుత్వం ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిందని, ప్రతి మరణంపై ఆడిట్ నిర్వహించిందని తెలిపారు. తమ కమిటీ తెలిపిన విషయాలన్నింటినీ బాంబే హైకోర్టు ముందు ఉంచుతామన్నారు. నాందేడ్‌ ఆస్పత్రిలో ఎలాంటి మందులు, వైద్యులు, సిబ్బంది కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు. పారిశుధ్య సమస్యలు కూడా లేవన్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. నాందేడ్‌ హాస్పిటల్‌ ఆవరణలో పందులు సంచరిస్తున్న వీడియోలు, ప్లాస్టిక్‌ బాటిళ్లతో నిండిపోయిన మురుగు నీటి కాలువలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రోగుల బంధువుల సైతం మెడిసిన్స్ బయట కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉందని చెప్తున్నారు. 


Tags:    
Advertisement

Similar News