దుబాయ్ పోలీసుల అదుపులో మహదేవ్ బెట్టింగ్ యాప్ యజమాని
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు దేశంలో కలకలం సృష్టించిన మహదేవ్ బెట్టింగ్ యాప్ మనీలాండరింగ్ వ్యవహారం నిందితుల్లో రవి ఉప్పల్ ఒకరు.
మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు, యాప్ యజమాని రవి ఉప్పల్‌ను దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటర్‌పోల్ ద్వారా రవి ఉప్పల్‌కు వ్యతిరేకంగా ఈడీ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయడంతో దుబాయ్‌లో స్థానిక అధికారులు ఆయనను నిర్బంధించారు. అయితే రవి ఉప్పల్‌ను గత వారమే దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన్ను భారత్‌కు తీసుకొచ్చేందుకు దుబాయ్ అధికారులతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు దేశంలో కలకలం సృష్టించిన మహదేవ్ బెట్టింగ్ యాప్ మనీలాండరింగ్ వ్యవహారం నిందితుల్లో రవి ఉప్పల్ ఒకరు. ఛత్తీస్‌గఢ్‌లోని భిలాల్ ప్రాంతానికి చెందిన రవి ఉప్పల్, సౌరభ్ చంద్రశేఖర్‌లు భారత్‌లో మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ను ప్రారంభించారు. దుబాయ్ కేంద్రంగా ఈ మహదేవ్ బెట్టింగ్ యాప్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ముసుగులో వీరు మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భూపేష్ బఘేల్‌కు రూ.508 కోట్లు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఒక్కొక్కరిని విచారణ జరిపిన ఈడీ, కేసుతో సంబంధం ఉన్న వారి నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలోనే కోల్‌కతా, భోపాల్, ముంబై సహా వివిధ నగరాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించగా వందల కోట్ల అక్రమ నగదు బయటికి వచ్చింది. యాప్ ద్వారా వచ్చే మొత్తాన్ని ఆఫ్‌షోర్ ఖాతాలకు తరలించేందుకు వీరు హవాలా మార్గాన్ని ఉపయోగిస్తున్నట్లు ఈడీ అధికారులు దర్యాప్తులో గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో రూ. 6000 కోట్ల వరకూ అవకతవకలు జరిగాయి.
ఇక మహదేవ్ బెట్టింగ్ యాప్ మరో ప్రమోటర్ అయిన సౌరభ్ చంద్రశేఖర్ వివాహం ఈ ఏడాది ఫిబ్రవరిలో యూఏఈలో అత్యంత అంగరంగ వైభవంగా జరిగింది. ఇందుకు రూ.200 కోట్లు ఖర్చు చేసినట్లు ఈడీ గుర్తించింది. సౌరభ్ చంద్రశేఖర్ పెళ్లికి హాజరైన బాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్, హుమా ఖురేషి, కపిల్ శర్మ, బోమన్ ఇరానీ, హీనా ఖాన్‌తో సహా పలువురు ప్రముఖులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు పంపింది. రవి, చంద్రశేఖర్ నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొనడానికి వారు హవాలా రూపంలో నగదును తీసుకున్నట్టు దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది.