ఐసీయూలోకి బూట్లతో రావొద్దన్నారు.. వెంటనే బుల్డోజర్ వచ్చింది

"ఏయ్..! నేనెవరో తెలుసా, లక్నో మేయర్ ని, నన్నే అడ్డుకుంటారా..? ఎంత ధైర్యం అంటూ గద్దించారు సుష్మ." మీరు ఎవరైనా సరే బూట్లు వేసుకుంటే ఐసీయూలోకి అనుమతించేది లేదంటూ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆమె ఇగో హర్ట్ అయింది.

Advertisement
Update:2023-08-23 22:10 IST

ఐసీయూలో ఉన్నప్పుడు పేషెంట్ ఆరోగ్యంపై డాక్టర్లు మరింత శ్రద్ధ పెడతారు. వీఐపీలయినా సరే పదే పదే ఐసీయూలోకి అనుమతించరు. ఒకవేళ అనుమతించినా శుభ్రత, ఇతర ప్రమాణాలు పాటిస్తారు. కానీ లక్నో నగర మేయర్ సుష్మా ఖరక్వాల్ మాత్రం తాను అన్నిటికీ అతీతురాలిని అని భావించారు. ఐసీయూలోకి వెళ్లే సమయంలో బూట్లు బయటే విడిచిపెట్టాలని సిబ్బంది అడ్డుకోవడంతో.. ఏకంగా ఆ ఆస్పత్రిపైకి బుల్డోజర్ పంపించారు. లక్నో మేయర్ నిర్వాకం ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ లో సంచలనంగా మారింది.

లక్నో మున్సిపాల్టీలో పనిచేస్తున్న మాజీ సైనికుడు సురేన్ ఇటీవల ఆస్పత్రిలో చేరారు. స్థానిక వినాయక్ మెడికేర్ ప్రైవేట్ ఆస్పత్రిలో ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఆయన్ను పరామర్శించేందుకు లక్నో మేయర్ సుష్మ మందీ మార్బలంతో వచ్చారు. అయితే ఆమె నేరుగా బూట్లతోనే ఐసీయూలో ప్రవేశించబోయారు. అక్కడున్న సిబ్బంది ఆమెను అడ్డుకోవడంతో అసలు గొడవ మొదలైంది.

"ఏయ్..! నేనెవరో తెలుసా, లక్నో మేయర్ ని, నన్నే అడ్డుకుంటారా..? ఎంత ధైర్యం అంటూ గద్దించారు సుష్మ." మీరు ఎవరైనా సరే ఐసీయూలోకి బూట్లు వేసుకుని అనుమతించేది లేదంటూ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆమె ఇగో హర్ట్ అయింది. తానేంటో చూపిస్తానంటూ అక్కడ్నుంచి వెళ్లిపోయిన సుష్మ, వెంటనే బుల్డోజర్ ని పంపించారు. ఆస్పత్రి కూల్చేయాలంటూ ఆదేశాలిచ్చారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది కాళ్లబేరానికి వచ్చారు. ఇంతలో పోలీసులు అక్కడికి రావడంతో వ్యవహారం రచ్చకెక్కింది. పోలీసులు ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చారు. తప్పు తనవైపే ఉన్నా కూడా ఆస్పత్రిపైకి బుల్డోజర్ పంపించి తన పవరేంటో చూపించారు సుష్మ. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆమెపై విపరీతమైన ట్రోలింగ్ మొదలైంది. ఆఖరుకి యూపీ ప్రభుత్వం బుల్డోజర్లను ఇలా వాడుకుంటోందన్నమాట అని మండిపడుతున్నారు నెటిజన్లు. 

Tags:    
Advertisement

Similar News