హిందువులు ఆ షాపింగ్ మాల్ కి వెళ్లొద్దు..!!

ఆ మాల్ లోకి హిందువులు ఎవరూ వెళ్లొద్దని హుకుం జారీ చేశారు.

Advertisement
Update:2022-07-14 15:42 IST

షాపులకు, షాపింగ్ మాల్స్ కి మతం ఉంటుందా, పోనీ వాటికి కూడా మతం రంగు పులిమితే ఏమవుతుంది..? అసలిలాంటి ఆలోచన ఎవరికీ వచ్చి ఉండదేమో..? కానీ తొలిసారిగా లక్నోలోని 'లులు' మాల్ కి ముస్లిం మాల్ అనే ముద్రవేశారు అఖిల భారత హిందూ మహాసభకు చెందిన వ్యక్తులు. ఆ మాల్ లోకి హిందువులు ఎవరూ వెళ్లొద్దని హుకుం జారీ చేశారు.

ఏం జరిగింది..?

ఇటీవల లక్నోలో 'లులు' మాల్ ప్రారంభమైంది. బాగా రద్దీగా నడుస్తోంది. అయితే సడన్ గా ఓ వీడియో బయటకొచ్చింది. ఆ షాపింగ్ మాల్ లో ముస్లింలు నమాజ్ చేశారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేయడంపై ఉత్తర ప్రదేశ్ లో ఆంక్షలున్నాయి. మరి 'లులు' మాల్ లో నమాజ్ ఎలా చేశారంటూ లాజిక్ తీస్తున్నారు అఖిల భారత హిందూ మహాసభ నాయకులు. అంతేకాదు, ప్రభుత్వ ఉత్తర్వులను ఆ మాల్ ఉల్లంఘించిందని, ఆ మాల్ లోకి హిందువులెవరూ వెళ్లకూడదని హెచ్చరించారు. బాయ్ కాట్ 'లులు' మాల్ అంటూ ఓ క్యాంపెయిన్ మొదలు పెట్టారు.

హిందూ మహాసభ జాతీయ అధికార ప్రతినిధి శిశిర్ చదుర్వేది 'లులు' మాల్ కి వెళ్లొద్దంటూ హిందువులకు పిలుపునిచ్చారు. హిందూ సంఘాలన్నీ `లులు` మాల్ పై చర్యలు తీసుకోవాలంటూ లక్నో పోలీసులకు ఫిర్యాదు చేశాయి. సీఎం యోగి కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని, మాల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు హిందూ మహాసభ నేతలు.

సోషల్ మీడియాలో 'లులు' మాల్ వ్యవహారం పెద్ద చర్చకు తావిస్తోంది. షాపింగ్ మాల్ లోని షాపుల్లో దేవుడి ఫొటోలు ఉంటాయని, అక్కడ పూజలు కూడా చేస్తుంటారని, అంత మాత్రాన ఆ షాపులకు ముస్లింలు వెళ్లకుండా ఉంటారా అని ప్రశ్నిస్తున్నారు కొందరు. చివరకు పంట పండించే రైతు తమ మతానికి చెందినవాడు కాకపోతే.. హిందూ మహాసభ నాయకులు అన్నం కూడా తినరేమోనని సెటైర్లు వేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News