స్వాతంత్య్ర సమర యోధుడికి లేఖ!

జైలులో ఉన్న జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి, కార్యకర్త ఉమర్ ఖలీద్ కు రోహిత్ కుమార్ అనే వ్యక్తి రాసిన బహిరంగ లేఖ.

Advertisement
Update:2022-08-17 21:57 IST

ప్రియమైన డాక్టర్ ఉమర్ ఖలీద్,

బిలీటెడ్ పుట్టినరోజు, స్వాతంత్య్ర‌ దినోత్సవ శుభాకాంక్షలు! జైలులో రెండవ పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం బాధగానే ఉంది. మీరు ప్రస్తుతం ఉన్న తీహార్ జైలులో వాళ్ళు 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' ఎలా జరుపుకున్నారో నాకు తెలియదు, కానీ ఇక్కడ, సంపన్నులు సుదీర్ఘ వారాంతం సెలవులు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తుండగా, పేదలు వీధుల్లో తిరుగుతూ మూడు రంగుల జెండాలు అమ్ముతున్నారు. ఈ అసమానతే కదా మిమ్మల్ని బాధపెట్టింది. భారతదేశ వ్యవస్థాగత సమస్యలను మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడం కోసం JNU నుండి PhD చేయడానికి పురికొల్పింది.

సెప్టెంబర్ 2017లో ఢిల్లీ ప్రెస్ క్లబ్‌లో మిమ్మల్ని మొదటిసారిగా కలుసుకున్న విషయం నాకు గుర్తుంది. అంతకు రెండు రోజుల ముందు హత్యకు గురైన జర్నలిస్టు గౌరీ లంకేష్ ను సంస్మరించుకోవడానికి, ఆ హత్యను ఖండించడానికి జర్నలిస్టులు, కార్యకర్తలు, ఇతరులు అనేక మంది అక్కడ గుమిగూడారు.

అప్పుడు మనం మాట్లాడుకున్నాం... మీరు రాజకీయాల్లో చేరాలని ఆలోచిస్తున్నారా అని నేను మిమ్మల్ని నేను అడిగాను. అయితే మీరు "నేను అట్టడుగు స్థాయిలో పని చేయడానికి, ఆదివాసీల సంక్షేమానికి, వారికి సహాయం చేయడానికి ఇష్టపడతాను." అని అన్నారు.

వ్యక్తిగత ఆస్తులు సంపాధించడమే అత్యున్నత లక్ష్యం అని నేర్పించే ప్రపంచంలో, జార్ఖండ్‌లోని గిరిజనుల సమస్యలను అధ్యయనం చేయడానికి , అర్థం చేసుకోవడానికి సమయాన్ని వెచ్చించే వ్యక్తిని కలవడం చాలా అరుదు.

మనం దాదాపు పదిహేను నిమిషాల పాటు కబుర్లు చెప్పుకున్నాం, అప్పుడు మీ పదునైన తెలివితేటలు, భారతదేశంలోని అట్టడుగున ఉన్న వారి పట్ల మీకున్న నిజమైన సానుభూతి నాపై లోతైన ముద్ర వేసింది. జైల్లో ఖైదీలు, వార్డెన్‌లు తదితరులతో మీరు ప్రతిరోజూ మాట్లాడుతూ వారిపై చూపే ప్రభావాన్ని నేను ఊహించగలను.

అమెరికన్ కవి ఎడ్గార్ గెస్ట్ చెప్పినట్లుగా, "ఒక మంచి మనిషి చాలా మందికి బోధిస్తాడు; మనుషులు వారు చూసే వాటిని నమ్ముతారు" మీకు తెలుసా? ప్రజలు అన్ని విషయాలు గమనిస్తారు.

జైల్లో మీరు మాట్లాడేవాళ్ళు, మీతో మాట్లాడేవాళ్ళు మిమ్మల్ని నిశితంగా గమనిస్తారు. వాళ్ళు స్వయంగా చూస్తూ , వింటున్న దాన్ని నమ్ముతారు. వార్తా మాధ్యమాలలో మీ గురించి వారు విన్న అబద్ధాలను ఇకపై నమ్మవద్దని జైలులో మీరు మాట్లాడే వాళ్ళకు, మీతో మాట్లాడేవాళ్ళకు నేను చెప్పదల్చుకున్నాను.

నేను జైలు జీవితాన్ని చాలా దగ్గరగా చూశాను.వాలంటీర్‌గా జైలు ఖైదీలకు అనేక సంవత్సరాలు కౌన్సెలింగ్ చేశాను. ఖైదీలు అనుభవించే భావోద్వేగాలు దగ్గరగా గమనించాను. జైలు జీవితం మిమ్మల్ని విచ్చిన్నం చేస్తుంది లేదా అద్భుతంగా తయారు చేస్తుంది. నేను వింటున్న దాన్ని బట్టి మీ జైలు జీవితం మిమ్మల్ని మరింత గొప్ప వ్యక్తిగా నిలబెట్టింది.

మీ స్నేహితురాలు బానోజ్యోత్స్న లాహిరి ఇటీవల మీ గురించి ది క్వింట్‌లో వ్రాసినట్లు...

"జైలుకు పోయిన కొత్తలో, అతను ఊపిరి సలపనట్టుగా ఉన్నాడు, బలవంతంగా పంజరంలో ఉన్న అడవి పిల్లిలా కదులుతూ ఉండేవాడు. 700 రోజుల ఖైదు తర్వాత, అతను చాలా ప్రశాంతంగా, పరిపక్వతతో ఉన్నాడు...''

భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన వాళ్ళు జైలులో గడిపిన సమయంలో ఎలాగైతే కొత్త శక్తిని కూడగట్టుకున్నారో మీరూ అదే విధంగా చేస్తున్నారు. వాళ్ళు కూడా మీలాగే సత్యం, అహింసను సమర్థించారు. వారిలాగే మీకు కూడా మీ దేశం పట్ల చాలా శ్రద్ధ ఉంది.

దేశం తన 75వ స్వాతంత్య్ర‌ దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ, పాలక యంత్రాంగం మిలియన్ల కొద్దీ పాలిస్టర్ జెండాలతో తన విపరీతమైన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించింది. అది తన దుశ్చర్యలను బహిర్గతం చేసేవారి గొంతు నొక్క‌డానికి తన శాయశక్తులా కృషి చేస్తున్నది. ఈ సమయంలో నిజమైన ఆజాదీ ఆలోచనను విశ్వసించే వారికి, పక్షపాతం, ద్వేషం, అసమానత, అన్యాయం నుండి ఆజాదీ కోరుకునేవారికి మీ జీవితం స్ఫూర్తిని ఇస్తుందని మర్చిపోకండి.

అవును, ఇక్కడ గోడీ మీడియా, వాట్సాప్ యూనివర్సిటీ అబద్ధాలను మింగిన వారు చాలా మంది ఉన్నారు, అయితే భారత రాజ్యాంగం యొక్క ఆదర్శాలను నిజంగా విశ్వసించే వారు కూడా చాలా మందే ఉన్నారు. వారికి, మీ ధైర్యసాహసాలు కాంతి కిరణం... ఆశాజ్యోతి.

Tags:    
Advertisement

Similar News