ప్రొఫెసర్‌ సాయిబాబా మృతికి మావోయిస్టు పార్టీ సంతాపం

ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరిన పార్టీ

Advertisement
Update:2024-10-15 14:02 IST

పౌర హక్కుల ఉద్యమ నాయకుడు, ప్రజాస్వామికవాది, రచయిత ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబా మృతికి మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్‌ మంగళవారం సంతాప ప్రకటన విడుదల చేశారు. ఆయన ఆశయాలను, ఆదర్శాలను కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధు మిత్రులు కొనసాగించాలని కోరారు. పౌర హక్కులను రక్షించడానికి ప్రజల తరుపున గొంతెత్తిన సాయిబాబాను ఫాసిస్టు రాజ్యమే పథకం ప్రకారం హత్య చేసిందన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ గా కొనసాగుతూ మలి దశ తెలంగాణ ఉద్యమానికి ఆయన మార్గనిర్దేశం చేశారన్నారు. ఆల్‌ ఇండియా పీపుల్ష్‌ రిసిస్టెన్స్‌ ఫోర్‌ (ఏఐపీఆర్‌ఎఫ్‌) ఆధ్వర్యంలో 1997లో ప్రజాస్వామిక తెలంగాణ కోసం వరంగల్‌ లో రెండు రోజుల సదస్సు నిర్వహించి, వరంగల్‌ డిక్లరేషన్‌ ప్రకటించారని గుర్తు చేశారు. ఫోరం ఎగనెస్ట్ వార్ ఇన్ పీపుల్స్ వేదికలో క్రియాశీలంగా పని చేశారని తెలిపారు. దేశ సంపదను, ప్రకృతి వనరులను కొల్లగొట్టి కార్పొరేట్ల చేతిలో పెట్టే ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌, సల్వజుడుం పేరుతో సాగిస్తోన్న పాశవిక దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. రాజ్యహింసను వ్యతిరేకించే వాళ్లను, ప్రశ్నించే శక్తులను తయారు చేసే వాళ్లను రాజ్యం కుట్ర పూరితంగా టార్గెట్‌ చేస్తోందని, మానవ హక్కులను ఉల్లంఘిస్తూ పెగసెస్‌ స్పైవేర్‌ లాంటి వాటితో సాయిబాబా కంప్యూటర్‌ లోకి చొరబడి ఆయనకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని అక్రమంగా నిందారోపణలు తెలిపారు. 90 శాతం వైకల్యంతో కదలలేని స్థితిలో వీల్‌ చైర్‌ లో ఉండే జీఎన్‌ సాయిబాబను అన్యాయంగా పదేళ్లు అండా సెల్‌ లో నిర్బంధించారని గుర్తు చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయనకు జైలులో కనీస వైద్య సౌకర్యం అందకుండా చేశారన్నారు. ఆయన నిర్దోషి అని కోర్టు తీర్పునిచ్చినా కొన్ని శక్తులు ఆయన విడుదల కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాయన్నారు. ఆయన మరణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థలే పూర్తి బాధ్యత వహించాలన్నారు. తనను చిత్రహింసలు పెట్టినా సాయిబాబా ఏనాడు రాజీ పడలేదన్నారు. జైలులో ఖైదీల హక్కుల కోసం ఆయన ధైర్యంగా పోరాడారని తెలిపారు. అత్యంత ధైర్యశాలి, వైకల్యాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం నిలబడిన సాయిబాబాకు మావోయిస్టు పార్టీ వినమ్రంగా జోహార్లు అర్పిస్తున్నదని వెల్లడించారు.

Tags:    
Advertisement

Similar News