'భోపాల్‌' విషాదంపై ముందే హెచ్చరించిన లాయర్‌

యూనియన్‌ కార్బైడ్‌ ఫ్యాక్టరీ దుర్ఘటన గురించి కీలకాంశాలు వెల్లడించిన న్యాయవాది షానవాజ్ ఖాన్‌

Advertisement
Update:2024-12-01 14:40 IST

నలభై ఏళ్ల కిందట మధ్యప్రదేశ్‌లోని యూనియన్‌ కార్బైడ్‌ ఫ్యాక్టరీ నుంచి వెలువడిన విషవాయువులు పెను విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి పలు కీలకాంశాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఫ్యాక్టరీ నుంచి విషవాయువులు వెలువడుతున్నాయని, దాన్ని మూసివేయాలని ఘటనకు ముందే నోటీసులు పంపినట్లు షానవాజ్ ఖాన్‌ అనే న్యాయవాది తెలిపారు. అయితే ఈ హెచ్చరికలను ఫ్యాక్టరీ యాజమాన్యం కొట్టిపారేసిందని వెల్లడించారు.

1983 మార్చి 4న యూనియన్‌ కార్బైడ్‌ ఇండియా లిమిటెడ్‌ (యూసీఐఎల్‌) కు షానవాజ్‌ లీగల్‌ నోటీసులు పంపారట. ప్లాంట్‌ జనవాసాల మధ్య ఉన్నది. దీనినుంచి వెలువడుతున్న విషపూరిత వాయువులు, రసాయనాల నిల్వలతో సమీప కాలనీలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే 50 వేల మంది ప్రాణాలకు హాని కలుగుతుంది. 15 రోజుల్లోపు మీ ఫ్యాక్టరీలో విషవాయువులు, ప్రమాదకర రసాయనాల వినియోగాన్ని నిలిపివేయాలి. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తాని నోటీసులు పేర్కొన్నట్లు ఆయన తెలిపారు.

1981లో ఆ ఫ్యాక్టరీలో పనిచేసే ఓ కార్మికుడు విషవాయుడు లీకవడంతో మృతి చెందాడని ఖాన్‌ తెలిపారు. ఆ తర్వాత అక్కడ పలుమార్లు ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో స్థానిక ప్రజలు అనారోగ్యానికి గురయ్యారని వెల్లడించారు. ఈ క్రమంలోనే తాను యూసీఐఎల్‌ లీగల్‌ నోటీసులు పంపించానన్నారు. అయితే వాటిని ఫ్యాక్టరీ యాజమాన్యం కొట్టిపారేసిందని తెలిపారు.

భోపాల్‌లోని యూనియన్‌ కార్బైడ్‌ ఫ్యాక్టరీ నుంచి 1984 డిసెంబర్‌ 2న అర్ధరాత్రి విష వాయువులు లీకయ్యాయి. ఆ దుర్ఘటనలో 5,479 మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు 5 లక్షల మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దాని బాధితులు ఇంకా న్యాయ పోరాటం చేస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News