శృంగార సమ్మతి వయసు తగ్గించొద్దు.. - లా కమిషన్ సూచన
పోక్సో చట్టం ప్రకారం ప్రస్తుతమున్న లైంగిక కార్యకలాపాలకు సమ్మతి వయసును మార్చడం అంత మంచిది కాదని లా కమిషన్ తన నివేదికలో పేర్కొంది.
దేశంలో బాలబాలికలు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనే వయసుకు సంబంధించి లా కమిషన్ పలు కీలక విషయాలను వెల్లడించింది. ఈ మేరకు రూపొందించిన నివేదికను కేంద్రానికి అందించింది. లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనే విషయంలో అందుకు సమ్మతి తెలిపే వయసును 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించాలంటూ ఇటీవల పలు న్యాయస్థానాలు సూచించిన నేపథ్యంలో ఈ అంశంపై దృష్టిసారించిన లా కమిషన్ దీనిపై తన నివేదికలో ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది.
ప్రస్తుతం పోక్సో చట్టం ప్రకారం..
పోక్సో చట్టం ప్రకారం ప్రస్తుతమున్న లైంగిక కార్యకలాపాలకు సమ్మతి వయసును మార్చడం అంత మంచిది కాదని లా కమిషన్ తన నివేదికలో పేర్కొంది. 1860లో సమ్మతి వయసు 10 ఏళ్లుగా ఉండగా.. ఆ తర్వాత అది క్రమంగా పెరుగుతూ వచ్చిందని వివరించింది. 1891లో 12 ఏళ్లకు.. 1925లో 14 ఏళ్లకు.. 1940లో 16 ఏళ్లకు పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత 2012లో పోక్సో చట్టం అమలులోకి వచ్చేవరకు మహిళల సమ్మతి వయసులో ఎటువంటి మార్పూ చేయలేదు. పోక్సో చట్టం వచ్చిన తర్వాత ఈ వయసును 18 ఏళ్లకు పెంచినట్టు న్యాయ కమిషన్ తన నివేదికలో పేర్కొంది.
విదేశాల్లో ఇలా..
శృంగార సమ్మతి వయసు వివిధ దేశాల్లో ఒక్కోలా ఉంది. ప్రస్తుతం కెనడాలో 16 ఏళ్లు.. అమెరికాలో ఫెడరల్ చట్టం ప్రకారం 18 ఏళ్లు ఉంది. అయితే అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో ఇది వేర్వేరుగా ఉంది. ఆస్ట్రేలియాలో పలు రాష్ట్రాల్లో 16 నుంచి 17 ఏళ్లుగా ఉంది. జపాన్‌లో మొన్నటివరకు 13 ఏళ్లుగా ఉండగా ఈ ఏడాదే దాన్ని 16 ఏళ్లకు పెంచారు. దక్షిణాఫ్రికాలో శృంగార సమ్మతి వయసు 16 ఏళ్లుగా ఉంది.