చంద్రుడిపై చీకటిపడుతోంది.. ఇక నిద్రావస్థలోకి మన రోవర్లు
చంద్రుడిపై రాత్రివేళ నెలకొనే ప్రతికూల పరిస్థితులను విక్రమ్, ప్రజ్ఞాన్లు తట్టుకోలేవు. ఏకబిగిన 14 రోజుల పాటు సూర్యకాంతి అందుబాటులో లేకపోవడం ఒక సమస్య. ఆ సమయంలో బ్యాటరీల రీఛార్జి అసాధ్యం.
చంద్రయాన్-3లో భాగంగా జాబిల్లిపై విజయవంతంగా అడుగుపెట్టిన భారత విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు తమకు నిర్దేశించిన లక్ష్యాలను దిగ్విజయంగా పూర్తిచేసుకొని విశ్రాంతికి సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా తొలుత రోవర్‌ను నిద్రాణ స్థితిలోకి పంపినట్టు శనివారం రాత్రి ఇస్రో ప్రకటించింది. రోవర్ తన లక్ష్యాలను పూర్తి చేసుకుందని, దాన్ని ఇప్పుడు సురక్షిత ప్రదేశంలో నిలిపి ఉంచి, నిద్రాణ స్థితిలోకి పంపేశామని వెల్లడించింది. అందులోని ఏపీఎక్స్ఎస్, లిబ్స్ పరికరాలను స్విచ్ఛాఫ్ చేసినట్టు తెలిపింది. ఈ రెండు సాధనాల నుంచి డేటా.. ల్యాండర్ ద్వారా ఇప్పటికే భూమికి చేరిందని వివరించింది.
నిద్రాణ స్థితి ఎందుకంటే..
విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లకు సౌర శక్తే ఆధారం. అవి సౌరఫలకాల ద్వారా సూర్యకాంతిని ఒడిసిపట్టి, బ్యాటరీలను రీఛార్జి చేసుకుంటాయి. అందువల్ల చంద్రుడిపై ఒక పగలు(భూమి మీద 14 రోజులతో సమానం) పనిచేసేలా వీటిని రూపొందించారు. ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో విక్రమ్ దిగేటప్పటికి అక్కడ తెల్లవారింది. అనంతరం ఆ వ్యోమనౌకలో నుంచి వెలుపలికి వచ్చిన ప్రజ్ఞాన్ కూడా తన బ్యాటరీలను రీఛార్జి చేసుకొని, పరిశోధనలు ప్రారంభించింది. ఈ వ్యోమనౌకలు దిగిన 'శివశక్తి` పాయింట్ వద్ద ఇప్పుడు సాయంకాలం మొదలైంది. వెలుగులు తగ్గుతున్నాయి. క్రమంగా చీకట్లు ఆవరించనున్నాయి. 14 రోజుల రాత్రి సమయం అక్కడ ప్రారంభం కానుంది.
చంద్రుడిపై రాత్రివేళ నెలకొనే ప్రతికూల పరిస్థితులను విక్రమ్, ప్రజ్ఞాన్లు తట్టుకోలేవు. ఏకబిగిన 14 రోజుల పాటు సూర్యకాంతి అందుబాటులో లేకపోవడం ఒక సమస్య. ఆ సమయంలో బ్యాటరీల రీఛార్జి అసాధ్యం. ఇక రెండో ఇబ్బందేమిటంటే.. జాబిల్లిపై రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు దాదాపు మైనస్ 200 డిగ్రీలకు పడిపోతాయి. ఇంత అసాధారణ శీతల వాతావరణాన్ని ల్యాండర్, రోవర్ లోని సున్నితమైన ఎలక్ట్రానిక్ ఉపకరణాలు తట్టుకోలేకపోవచ్చు. అందువల్ల ఈ రెండు వ్యోమనౌకలను నిద్రాణ స్థితిలో ఉంచుతున్నారు.
సూర్యోదయమయ్యాక...
నిద్రాణ స్థితిలోకి వెళ్లడానికి ముందు వరకూ విక్రమ్, ప్రజ్ఞాన్‌లు అద్భుతంగా పనిచేశాయని ఇస్రో తెలిపింది. అందువల్ల 14 రోజుల రాత్రి పూర్తయి, సూర్యోదయమయ్యాక అవి క్రియాశీలమయ్యే అవకాశం లేకపోలేదని పేర్కొంది. ఇది సాధ్యం కావాలంటే నిద్రాణ స్థితికి ముందే ల్యాండర్, రోవర్ బ్యాటరీలు పూర్తిస్థాయిలో రీఛార్జి కావాలని వివరించింది. చంద్రుడిపై రాత్రి సమయంలో తలెత్తే శీతల ఉష్ణోగ్రతలను తట్టుకోవాలని పేర్కొంది. ప్రస్తుతం విశ్రాంతి దశలోకి వెళ్లిన రోవర్లోని బ్యాటరీలు పూర్తిగా రీఛార్జి అయ్యాయని ఇస్రో తెలిపింది. మళ్లీ ఈ నెల 22న శివశక్తి పాయింట్ వద్ద సూర్యోదయమవుతుందని పేర్కొంది.
ఆ రోజున సూర్యకాంతిని అందుకునేలా రోవర్ సౌరఫలకం దృక్కోణాన్ని మార్చినట్టు ఇస్రో వెల్లడించింది. దాని రిసీవర్‌ను ఆన్ చేసి పెట్టినట్లు పేర్కొంది. సూర్యోదయమయ్యాక దాన్ని తిరిగి ఆన్ చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పింది. తద్వారా మరో విడత లక్ష్యాలను ఛేదించేందుకు అది సిద్ధమవుతుందని వివరించింది. ఒకవేళ అది క్రియాశీలం కాకుంటే చంద్రమండలంపై భారత రాయబారిగా ఎప్పటికీ ఉండిపోతుందని పేర్కొంది. ప్రజ్ఞాన్ రోవర్.. ల్యాండర్ నుంచి ఇప్పటివరకు 100 మీటర్లకు పైగా దూరం ప్రయాణించినట్లు ఇస్రో ఈ సందర్భంగా వెల్లడించింది.
♦