సుప్రీంకోర్టుకు చేరిన కోల్‌కతా రేప్ అండ్ మర్డర్ కేసు
దేశవ్యాప్తంగా వైద్యులు, ప్రజలు న్యాయం కోసం నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
యావత్ దేశాన్ని కుదిపేస్తున్న కోల్‌కతా జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య కేసు కీలక మలుపు తీసుకుంది. సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జె.బి.పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం మంగళవారం ఈ కేసును విచారించనుంది.
ఆగస్టు 9న కోల్‌కతా ఆర్జీకర్ హాస్పిటల్‌లోని సెమినార్ హాల్‌లో 31 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్‌ను అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. దేశవ్యాప్తంగా వైద్యులు, ప్రజలు న్యాయం కోసం నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక ఈ ఘటన జరిగిన మరుసటి రోజే ఈ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు కోల్‌కతా పోలీసులు. ఈ కేసులో సంజయే ప్రధాన నిందితుడని పోలీసులు చెప్తున్నారు. కాగా, బెంగాల్ పోలీసుల విచారణలో లోపాలను ఎత్తి చూపుతూ ఈ కేసు విచారణను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ - CBIకి బదిలీ చేసింది కోల్‌కతా హైకోర్టు.