క్రికెట్ వీక్షకుల రేస్‌లో జియోను మించిన హాట్ స్టార్!

2023- ఐసీసీ వన్డే ప్రపంచకప్ ప్రత్యక్ష ప్రసారాల వీక్షకుల సంఖ్య ప్రపంచ రికార్డు స్థాయికి చేరింది. గతంలో జియో సినిమా నెలకొల్పిన రికార్డును డిస్నీ హాట్ స్టార్ అధిగమించింది.

Advertisement
Update:2023-10-23 17:05 IST

ఐసీసీ వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో ఓ వైపు పదిజట్లు పోటీపడుతుంటే.. మరోవైపు తమ తమ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా క్రికెట్ వీక్షకులను తమ గుప్పిట్లో పెట్టుకోడానికి ముకేశ్ అంబానీ చెందిన జియో సినిమా, డిస్నీ హాట్ స్టార్‌ల నడుమ హాట్ ఫైటే కొనసాగుతోంది.

ఐపీఎల్‌తో జియో, ప్రపంచకప్‌తో డిస్నీ!

క్రీడాభిమానులను, ప్రధానంగా క్రికెట్ అభిమానులను ఆకట్టుకోవ‌డానికి జియో సినిమా, డిస్నీ హాట్ స్టార్ ల నడుమ పోరు పతాకస్థాయికి చేరింది. 2023 ఐపీఎల్ సీజన్ మ్యాచ్‌లతో పాటు.. భారత జట్టు ఆడే అంతర్జాతీయ ద్వైపాక్షిక సిరీస్ మ్యాచ్‌లను స్మార్ట్ ఫోన్ల ద్వారా ఉచితంగా ప్రసారం చేస్తూ.. డిస్నీ హాట్ స్టార్ సబ్ స్క్రయిబర్లను జియో సినిమా ఆకట్టుకోవ‌డం, తన గుప్పిట్లోకి తీసుకోవ‌డం ద్వారా ప్రసారహక్కుల మార్కెట్ నియంత్రణలో పైచేయి సాధించింది.

ఇటీవలే ముగిసిన ఆసియాకప్ టోర్నీలో భాగంగా భారత్- పాకిస్తాన్ జట్ల నడుమ జరిగిన మ్యాచ్ ను జియో సినిమా తన డిజిటల్ వేదికల ద్వారా ఉచితంగా ప్రసారం చేసి 3 కోట్ల 50 లక్షల మంది వీక్ష‌కుల‌ను ఆకట్టుకోగలిగింది. వీరిలో డిస్నీ హాట్ స్టార్ సబ్ స్క్రయిబ‌ర్లు భారీసంఖ్యలోనే ఉన్నారు. భారత్ ఆడే ద్వైపాక్షిక సిరీస్ ల ప్రత్యక్షప్రసార హక్కులను 5,959 కోట్ల రూపాయలకు సొంతం చేసుకోడం ద్వారా డిస్నీ హాట్ స్టార్ కోటలో జియో సినిమా పాగా వేసింది. డిస్నీ హాట్ స్టార్ కు అప్పటి వరకూ 40.4 మిలియన్ల సబ్ స్క్రయిబర్లలో 12.5 మిలియన్ల మందిని జియో సినిమో తనవైపున‌కు తిప్పుకోగలిగింది. జియో సినిమా కొట్టిన దెబ్బతో గత అక్టోబర్ నుంచి హాట్ స్టార్ 21 మిలియన్ సబ్ స్క్రయిబర్లను కోల్పోయింది.

ప్రపంచకప్ ప్రసారాలతో దెబ్బకు దెబ్బ!

ఉచిత ప్రత్యక్ష ప్రసారాలతో జియో సినిమా తనను కొట్టిన దెబ్బను డిస్నీ హాట్ స్టార్ అదే ఉచిత ప్రసారాలతో ఎదురుదెబ్బ కొట్టింది. ఐసీసీ ప్రపంచకప్ పోటీల ప్రత్యక్ష ప్రసార హక్కులను 24,789 కోట్ల రూపాయల ధరకు దక్కించుకోవ‌డం ద్వారా అంతర్జాతీయ మార్కెట్ పైన హాట్ స్టార్ పట్టుబిగించింది.

ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ పోటీలను సైతం ఉచితంగా ప్రసారం చేయడం ద్వారా జియో సినిమా చెంతకు చేరిన సబ్ స్క్రయిబర్లను తిరిగి హస్తగతం చేసుకోగలిగింది. ధర్మశాల వేదికగా భారత్- న్యూజిలాండ్ జట్ల నడుమ జరిగిన 5వ రౌండ్ మ్యాచ్ ను రికార్డుస్థాయిలో 43 మిలియన్ల మంది వీక్షించారు. ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా డిస్నీ హాట్ స్టార్ గతంలో జియో సినిమా నెలకొల్పిన రికార్డును అధిగమించగలిగింది.

4.40 కోట్ల‌ మంది వీక్షించిన భారత్- న్యూజిలాండ్ పోరు..

గతంలో జియో సినిమా ఉచితంగా ప్రసారం చేసిన భారత్- పాక్ జట్ల మ్యాచ్ ను పీక్ టైమ్ లో 3 కోట్ల 50 లక్షల మంది వీక్షించగా.. భారత్- న్యూజిలాండ్ జట్ల ప్రపంచకప్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 90 పరుగుల స్కోరును దాటి సెంచరీకి చేరువైన తరుణంలో 4.40 కోట్ల‌ మంది వీక్షించడం సరికొత్త రికార్డుగా నమోదయ్యింది. దీంతో జియో సినిమా రికార్డు డిస్నీ హాట్ స్టార్ అధిగమించడం ద్వారా తిరిగి మార్కెట్ లీడర్ గా నిలువగలిగింది. 2024- 2027 మధ్యకాలంలో జరిగే ఐసీసీ ప్రపంచకప్ క్రికెట్ టోర్నీల ప్రత్యక్ష ప్రసార హక్కులను 24,789 కోట్ల రూపాయలకు డిస్నీ దక్కించుకోడం ద్వారా జియో సినిమాకు పగ్గాలు వేయగలిగింది.

క్రికెట్ ప్రసారాలను స్మార్ట్ ఫోన్ల ద్వారా ఉచితంగా చూడవచ్చంటూ జియో సినిమా చేసిన ప్రయోగంతో డిస్నీ హాట్ స్టార్ వందల కోట్ల రూపాయల మేర నష్టపోక తప్పలేదు. అయితే.. ప్రత్యక్షప్రసారాల సమయంలో బహుళజాతి కంపెనీల యాడ్లను వేస్తూ ఇటు జియో సినిమా, అటు డిస్నీ హాట్ స్టార్ నష్టాలను పూడ్చుకోడమే కాదు.. దండిగా సంపాదించుకోగలుగుతున్నాయి. ప్రసార హక్కుల కోసం జియో సినిమా, డిస్నీహాట్ స్టార్ కుస్తీ పడుతుంటే.. బీసీసీఐతో పాటు ఐసీసీ సైతం రికార్డుస్థాయిలో వందల కోట్ల నుంచి వేలకోట్ల రూపాయల మేర ఆర్జించగలుగుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News