అతని సర్టిఫికెట్లలో తండ్రి పేరు తీసేయండి....కేరళ హైకోర్టు సంచలన తీర్పు

Advertisement
Update:2022-07-25 11:49 IST

మన దేశం లో ఏ సర్టిఫికెట్లలోనైనా తండ్రి పేరు తప్పకుండా ఉండాల్సిందే. మరి అవివాహిత తల్లులకు పుట్టిన బిడ్డలు, అత్యాచార బాధితులకు పుట్టిన బిడ్డలకు సర్టిఫికెట్లలో తండ్రి పేరు ఉండటం ఎలా సమంజసమవుతుంది ? కేరళ హైకోర్టు కూడా ఇదే మాట చెప్పి౦ది.

తన సర్టిఫికెట్లలో తండ్రి పేరు తీసేయాలని కోరుతూ అవివాహిత తల్లికి కుమారుడైన‌ ఓ వ్యక్తి కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ సందర్భంగా కోర్టు అవివాహిత తల్లులు, అత్యాచార బాధితుల పిల్లలు గోప్యత, స్వేచ్ఛ, గౌరవం లాంటి ప్రాథమిక హక్కులతో ఈ దేశంలో జీవించడానికి అర్హులు అని పేర్కొంది. రాజ్యాంగం హామీ ఇచ్చిన అతని/ఆమె ప్రాథమిక హక్కులను ఎవరూ ఉల్లంఘించలేరని జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ జూలై 19న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పిటిషనర్ తన తల్లి పేరును మాత్రమే జనన ధృవీకరణ పత్రం, గుర్తింపు ధృవీకరణ పత్రాలతో సహా ఇతర అన్ని పత్రాల్లో చేర్చడానికి హైకోర్టు అనుమతినిచ్చింది.

పిటిషనర్‌కు సంబంధించి బర్త్ రిజిస్టర్ నుండి తండ్రి పేరును తొలగించాలని, తల్లి పేరును మాత్రమే సింగిల్ పేరెంట్‌గా చూపుతూ సర్టిఫికేట్ జారీ చేయాలని జనన, మరణాల రిజిస్ట్రార్‌ను కోర్టు ఆదేశించింది.

వారి గుర్తింపు, గోప్యతను వెల్లడించకుండా ఇతర పౌరులతో సమానంగా వీరిని కూడా రాజ్యం రక్షించాలని కోర్టు పేర్కొంది. లేకపోతే, వారు ఊహించలేని మానసిక వేదనలను ఎదుర్కొంటారు" అని కోర్టు అభిప్రాయపడింది..

సాధారణ విద్యా శాఖ, హయ్యర్ సెకండరీ పరీక్షల బోర్డు, ఆధార్ కార్డ్, IT విభాగం, పాస్‌పోర్ట్ అధికారి, భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కూడా వారి అధికారిక రికార్డులు, డేటాబేస్ లలో పిటిషనర్ తండ్రి పేరును తొలగించాలని కోర్టు ఆదేశించింది. 

Tags:    
Advertisement

Similar News