మంత్రి ప‌ద‌వుల‌ను ఊడ‌బీకుతా : కేరళ మంత్రుల‌కు గ‌వ‌ర్న‌ర్ హెచ్చ‌రిక‌

కేరళ మంత్రులను పీకిపడేస్తానని ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మ‌హ్మ‌ద్ ఖాన్ హెచ్చరించారు. గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం గౌర‌వాన్ని కించ‌ప‌రిచేలా మ‌ర్యాద‌ను త‌గ్గించేలా వ్యాఖ్య‌లు, ప్ర‌క‌ట‌న‌లు చేసేవారిపై చ‌ర్య‌లు తీసుకుంటామని ఆయన అన్నారు.

Advertisement
Update:2022-10-17 19:02 IST

త‌న‌పై విమ‌ర్శ‌లు చేసినా, ఎటువంటి వ్యాఖ్యలు చేసినా చ‌ర్య‌లు తీసుకోవ‌డ‌మే గాక మంత్రి ప‌ద‌వుల‌నుంచి తొల‌గిస్తాన‌ని కేర‌ళ‌ గ‌వ‌ర్న‌ర్ ఆరిఫ్ మ‌హ్మ‌ద్ ఖాన్ రాష్ట్ర కేబినెట్ మంత్రుల‌ను హెచ్చ‌రించారు. సోమ‌వారంనాడు గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం ఒక ట్వీట్ చేస్తూ..గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం గౌర‌వాన్ని కించ‌ప‌రిచేలా మ‌ర్యాద‌ను త‌గ్గించేలా వ్యాఖ్య‌లు, ప్ర‌క‌ట‌న‌లు చేసేవారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 గురించి గవర్నర్ ప్రస్తావిస్తూ, "గవర్నర్ ఆమోదం మేర‌కే మంత్రులు పదవిలో ఉంటారు" అని చెప్పారు. వివిధ అంశాలపై ఎల్‌డిఎఫ్ ప్రభుత్వంతో ఘర్షణలు కొనసాగుతున్న నేపథ్యంలో గవర్నర్ ఇలా తీవ్ర హెచ్చరికలు చేయ‌డం గ‌మనార్హం.

పినరయి విజయన్ కేబినెట్‌లోని కొందరు మంత్రులు గతంలోనూ గవర్నర్‌పై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. అయితే, ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్ బిందు శుక్రవారం చేసిన వ్యాఖ్య‌ల‌పైనే ఖాన్ తాజాగా తీవ్రంగా స్పందించ‌డానికి కార‌ణ‌మ‌ని భావిస్తున్నారు.

యూనివర్సిటీ చట్టాల (సవరణ) బిల్లుకు ఆమోదం తెలిపేందుకు గవర్నర్ నిరాకరించిన నేపథ్యంలో మంత్రి ఆర్ బిందు శుక్ర‌వారంనాడు స్పంద‌స్తూ..అందరూ తమ రాజ్యాంగ విధులకు కట్టుబడి ఉండాల‌ని గవర్నర్‌పై మండిపడ్డారు.

గవర్నర్ తాజా ట్వీట్‌పై మంత్రి బిందు స్పందిస్తూ.. తాను గవర్నర్‌ కార్యాలయ గౌరవాన్ని కించపరిచేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. "మేమంతా (మంత్రులు) చాలా సంయమనంతో మాట్లాడుతున్నాము" అని మంత్రి మీడియాతో అన్నారు.

కాగా, తనను విమర్శించే మంత్రులను బహిష్కరిస్తానని గవర్నర్ బెదిరించడం రాజ్యాంగం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై ఆయనకున్న 'అజ్ఞానాన్ని' తెలియజేస్తోందని అధికార సీపీఎం పేర్కొంది. మంత్రులను ఉపసంహరించుకునే అధికారం గవర్నర్‌కు లేదని, ముఖ్యమంత్రి సలహా మేరకే ఆయన మంత్రులను నియమించగలరు లేదా తొలగించగలరు అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ అన్నారు.

Tags:    
Advertisement

Similar News