కొంప ముంచిన AI.. కేరళలో వీడియో కాల్ మోసం

స్నేహితుడు కళ్లముందు వీడియో కాల్ లో కనపడుతుంటాడు. ఇక నిర్థారించుకునే అవకాశమెక్కడిది. ఈ టెక్నిక్ తోనే మోసగాళ్లు బరితెగించారు.

Advertisement
Update:2023-07-18 08:02 IST

ఆధునిక సాంకేతికతతో ఉపయోగాలు ఎన్ని ఉంటాయో, అంతకు మించిన మోసాలు కూడా సహజం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) విషయంలో కూడా ఇది నిజమని మరోసారి రుజువైంది. AI అందుబాటులోకి వచ్చాక, దాన్ని వినియోగించుకుంటూ హోమ్ వర్క్, ప్రాజెక్ట్ వర్క్ ని తప్పించుకుంటున్నారు విద్యార్థులు. కొంతమందికి ఆఫీస్ వర్క్ కూడా సులభమైంది. అయితే దీనిద్వారా కొన్ని ఉద్యోగాలకు కూడా ఎసరు వచ్చింది. ఇదంతా సహజ ప్రక్రియ అనుకుంటే ఇప్పుడు AIని మోసాలకోసం ఉపయోగించుకుంటున్నారు కొంతమంది.

AI ద్వారా వ్యక్తుల ముఖాన్ని మార్చేసే టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. మార్ఫింగ్ అనేది చాలా సులభంగా మారింది. గతంలో మార్ఫింగ్ వీడియోలు, ఫొటోలు అనే కాన్సెప్ట్ ఉండేది. AI ద్వారా లైవ్ వీడియోలను కూడా సులభంగా మార్ఫింగ్ చేసేయొచ్చు. ఇదే విధానం ఉపయోగించుకుని ఓ వ్యక్తి వాట్సప్ వీడియో కాల్ ద్వారా రాధాకృష్ణన్ అనే వ్యక్తిని మోసం చేశాడు. 40వేల రూపాయలు కాజేశాడు. బాధితుడు కేరళలోని కోజికోడ్ కి చెందిన ఓ ఉద్యోగి.

ఇటీవల కాలంలో సోషల్ మీడియా యాప్స్ ద్వారా డబ్బులు కావాలంటూ స్నేహితులనుంచి మెసేజ్ లు రావడం చూస్తూనే ఉన్నాం. మన స్నేహితుల ఫొటోలను అదే సోషల్ మీడియానుంచి డౌన్లోడ్ చేసుకుని, వారి సమాచారాన్నంతా సేకరించి, వారి పేరుతో ఫేక్ అకౌంట్లు సృష్టించి ఇలా డబ్బులు అడుగుతుంటారు కేటుగాళ్లు. వాళ్లు మన స్నేహితులే అని నమ్మి డబ్బులు పంపించామంటే ఇక అంతే సంగతులు. అయితే ఇక్కడ ఓ వెసులుబాటు ఉంది. మన స్నేహితుడికి ఫోన్ చేసి, ఫలానా మెసేజ్ పంపించింది నువ్వేనా అని అడిగే అవకాశముంది. కానీ AI వచ్చిన తర్వాత ఆ అవకాశం లేదు. ఎందుకంటే స్నేహితుడే కళ్లముందు వీడియో కాల్ లో కనపడుతుంటాడు. ఇక నిర్థారించుకునే అవకాశమెక్కడిది. ఈ టెక్నిక్ తోనే మోసగాళ్లు బరితెగించారు. కోజికోడ్ ఘటన జస్ట్ ఒక ఉదాహరణ మాత్రమే. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని మోసాలకు దీన్ని ఓ హెచ్చరికగా భావించాలంటున్నారు నిపుణులు. 

Tags:    
Advertisement

Similar News