పార్శిళ్లకు మంగళం.. వ్యాపారులకు షాక్
ఆహారం పార్శిల్ కడితే కచ్చితంగా దానిపై లేబుల్ అంటించాలి. పార్శిల్ లోని ఆహార పదార్థాలు ఎప్పుడు తయారయ్యాయి? ఎప్పటిలోగా తినడం సురక్షితం? అనే వివరాలను వాటిపై ముద్రించాలి.
నాలుగు ఇడ్లీ, రెండు దోశ పార్శిల్...
ఒక ఫుల్ మీల్స్ పార్శిల్..
ఇకపై కేరళలో ఇలా పార్శిల్ అనే మాటలు తక్కువగా వినపడతాయి. పార్శిళ్లపై అక్కడి ప్రభుత్వం కాస్త కఠినంగా వ్యవహరిస్తోంది. ఇటీవల కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా జరిగిన వరుస ఘటనలతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇకపై ఫుడ్ పార్శిల్ ఇవ్వాలంటే కచ్చితంగా దానిపై లేబుల్ ఉండాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 1నుంచి ఈ ఆదేశాలు అమలులోకి వచ్చాయి. దీంతో చాలా చోట్ల పార్శిళ్లు తగ్గిపోయాయి.
కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా బిర్యానీ పార్శిల్ తెప్పించుకుని తిన్న ఇద్దరు యువతులు కేరళలోని వేర్వేరు ప్రాంతాల్లో మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత కూడా ఇలాంటి ఉదాహరణలు వెలుగులోకి వచ్చాయి. ఇవన్నీ పార్శిల్ లు తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ కావడంతో జరిగిన ఘోరాలే. అందుకే ఆహార పార్శిళ్ల విషయంలో కొత్త మార్గదర్శకాలు విడుదల చేశారు ఆరోగ్య మంత్రి వీణా జార్జ్. కొత్త నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆహారం పార్శిల్ కడితే కచ్చితంగా దానిపై లేబుల్ అంటించాలి. పార్శిల్ లోని ఆహార పదార్థాలు ఎప్పుడు తయారయ్యాయి? ఎప్పటిలోగా తినడం సురక్షితం? అనే వివరాలను వాటిపై ముద్రించాలి. హోటళ్ల నిర్వాహకులు, ఇతర ఆహార పదార్థాల తయారీదారులు హెల్త్ కార్డులు తప్పనిసరిగా తీసుకోవాలి.
హోటల్ చిన్నదైనా, పెద్దదైనా ఈ ఆదేశాలూ పాటించాల్సిందే. ఒకవేళ పార్శిళ్లకు ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకుంటే.. పార్శిల్ సెక్షన్ రద్దు చేసుకోవచ్చని కూడా సూచించారు అధికారులు. దీంతో కేరళలో వ్యాపార వర్గాలు ఆందోళనలో పడ్డాయి. చిన్న చిన్న హోటళ్లలో లేబుల్స్ అంటించాలంటే కష్టం. తయారీ తేదీ, బెస్ట్ బిఫోర్ అంటూ మరో తేదీ ముద్రించి అమ్మాలంటే అది ఖర్చుతో కూడుకున్న పని. ఈ విషయంలో చిన్న హోటళ్లను మినహాయించాలని కోరుతున్నారు కేరళ వ్యాపారులు. ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది.